NTV Telugu Site icon

టీఆర్ఎస్ పాలనలో మెదక్ అనూహ్య అభివృద్ధి

మెతుకుసీమగా పేరున్న మెదక్ తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో అనూహ్య అభివృద్ధి సాధించిందని అన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మెదక్ జిల్లా అభివృద్ధివైపు అడుగులు వేస్తోందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి చెందని మెదక్ నియోజకవర్గం, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు అన్నారు.

మెదక్ పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నేరవేర్చినట్లు తెలిపారు. ఈ ప్రాంతం నుంచి గెలుపొంది దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఇందిరాగాంధీ చేయని పనులను సీఎం కేసీఆర్ నెరవేర్చినట్లు చెప్పారు. జిల్లా కేంద్రం ఏర్పడక ముందు పట్టణంలోని కొన్ని జిల్లా కార్యాలయాలు సంగారెడ్డికి తరలి పోతుంటే స్వార్ధపరులు నోరుమెదపడం లేదని ఆరోపించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగు పర్చాలన్న ఉద్దేశంతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యతను కల్పిస్తూ వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృషితో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిగా బాలానగర్ నుంచి మెదక్ పట్టణానికి రూ.322 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం చేపట్టి పూర్తి చేసినట్లు వివరించారు.