Manufacturing Machine Scam In Hyderabad Victims Seeks Justice: దీపం వత్తులు, బొట్టు బిల్లలు, సాంబ్రాణి తయారీ మిషన్ల పేరుతో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే! ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యి మందికి పైగా వ్యక్తులకు టోకరా వేసి, రూ. 200 కోట్లు దోచేశాడు. ఆర్ఆర్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఒక కంపెనీ స్థాపించిన రమేశ్ అనే వ్యక్తి.. ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. దీంతో.. బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయమంటూ అధికారుల్ని వేడుకుంటున్నారు.
ఒక్కొక్క మిషన్‌కి తాము రూ. 75 వేలు నుంచి రూ. 5 లక్షల వరకు చెల్లించామని బాధితులు పేర్కొంటున్నారు. తాను ఎక్స్ సర్వీస్‌మ్యాన్ అని చెప్పేవాడని, అతని మాటలు నమ్మి లక్షల రూపాయలు మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము మిషన్స్ తీసుకున్న కొద్దిరోజులకే అవి పాడయ్యాయని.. తమతో పనులు చేయించుకొని, తమ వద్ద RAW మెటీరియల్‌తో పాటు మిషన్‌కు డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ రోదిస్తున్నారు. తాము డబ్బుల కోసం ఫోన్ చేస్తే, స్విచాఫ్ వస్తోందని.. తామంతా వందలాది మంది బాధితులం ఉన్నామని.. తమకు న్యాయం చేయమని కోరుతున్నారు.
కాగా.. మోసగాడైన రమేష్ హైదరాబాద్‌లోని కుషాయిగూడతో పాటు వైజాగ్, కడపలో ఆర్ఆర్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో కంపెనీలు పెట్టాడు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్‌తో పాటు వేర్వేరు జిల్లాల్లోని వ్యక్తులు ఇతని చేతిలో మోసపోయారు. ఆంద్రప్రదేశ్‌లో కడప, అనంతపురంతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఇతని బాధితులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.