Man Executed His Friend In Patancheru For Asking Debt: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో దారుణం చోటు చేసుకుంది. ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు ఓ యువకుడ్ని దారుణంగా హతమార్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొంతకాలం క్రితం ఇస్మాయిల్ అనే వ్యక్తికి మహ్మద్ సమీర్ అహ్మద్ (28) అనే యువకుడు రూ. 50 వేలు అప్పు ఇప్పించాడు. గడువు ముగిసిన తర్వాత తిరిగి అప్పు అడిగితే.. అదిగో, ఇదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చాడు. రోజులు గడుస్తున్నా అప్పు ఇవ్వకపోవడంతో.. వడ్డీతో సహా మొత్తం అప్పు ఇవ్వాలని ఇస్మాయిల్‌పై మహ్మద్ సమీర్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో మహ్మద్ సమీర్‌పై కోపం పెంచుకున్న ఇస్మాయిల్.. అతడ్ని హత మార్చాలని నిర్ణయించాడు. అందుకు ఓ ప్రణాళిక రచించాడు.
తొలుత అనాథ శవం వస్తోందని నమ్మించి.. పటాన్‌చెరు శివారులో ఉన్న ఈద్గాలో మహ్మద్ సమీర్‌తో కలిసి ఇస్మాయిల్ గుంత తవ్వాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈనెల 9వ తేదీన పెయింటింగ్ పని ఉందని చెప్పి, మహ్మద్ సమీర్‌ను ఓ ప్రాంతానికి పిలిపించాడు. మహ్మద్ సమీర్ అక్కడికి చేరుకోగానే.. ఇస్మాయిల్ అతనిపై ఒక్కసారిగా దాడి చేసి, కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా.. ఇంతకుముందు తీసిన గుంతలో అనాథ శవంలా పూడ్చాడు. మహ్మద్ కనిపించడం లేదని ఫిర్యాదు అందండంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇస్మాయిల్‌పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. అతనితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మహ్మద్ సమీర్ అహ్మద్ మృతదేహాన్ని తవ్వి తీసి, తహశీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.
