NTV Telugu Site icon

ప్రేమోన్మాది దాడి.. యువతి పరిస్థితి విషమం.. దర్యాప్తు ముమ్మరం

ఎల్బీ నగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ప్రేమోన్మాది దాడి కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు… ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతి ప్రస్తుతం ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం చంద్రకల్‌కు చెందిన యువతికి, అదే గ్రామానికి చెందిన బస్వరాజ్‌తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారింది. ఆ ఇద్దరు హైదరాబాద్‌కు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. హస్తినాపురంలోని తన పిన్ని దగ్గర ఆ యువతి ఉంటుండగా.. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. 3 నెలల క్రితం ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిపించారు. దీంతో.. కక్ష పెంచుకున్న బస్వరాజ్‌.. పథకం ప్రకారం యువతిపై దాడి చేశారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి కడుపు, వెన్నులో పొడిచాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వేరొకర్ని పెళ్లి చేసుకుంటున్నానని బస్వరాజు పొడిచాడు.. గతంలో మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఇంట్లో ఒప్పుకోలేదు. ఇప్పుడు వేరే వ్యక్తితో నిశ్చితార్థమైంది. రోడ్డు మీద అందరూ చూస్తుండగా కత్తితో పొడిచాడని బాధితురాలు తెలిపింది.

Read Also: కొత్త ప్రయాణం చేస్తున్న.. మీ ఆశీస్సులు కావాలి..

ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఆమె శరీరంపై 18 చోట్ల గాయలున్నట్లు గుర్తించిన వైద్యులు వాటిలో.. ఆరు ప్రదేశాల్లో గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బాధితురాలు కోలుకునేందుకు శ్రమిస్తున్నామని.. 48 గంటలు గడిస్తే గానీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఒక అంచనాకు రాలేమని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయంలో చాలా రక్తస్రావం జరిగింది. 48 గంటల తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తాం. మేజర్​గా ఏమైనా గాయాలైనాయి అనేది స్కానింగ్​ తర్వాత తెలుస్తుంది. సుమారుగా 18 గాయాలు ఉన్నాయి. ఇంటర్నల్​గా ఏమైనా గాయాలు ఉన్నట్లు తేలితే దాన్నిబట్టి చికిత్స చేస్తాం అన్నారు. మరోవైపు.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.. ఇప్పటికే నిందితుడు బస్వరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.. ఇక, బస్వరాజ్​ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు..