మంచిర్యాల జిల్లాలో మద్యం షాపులపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల బెల్లంపల్లిలోని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, రీసెంట్ గా జిల్లాలోని ఇందారం గ్రామంలో కల్తీ మద్యం దందాని నడిపిస్తున్న లక్ష్మీగణపతి వైన్స్ ను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. తాజాగా ఇందారం సమీప గ్రామంలోని రామారావుపేట్ లో అక్రమ మద్యం అమ్మకాలు చేస్తున్న దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించారు.
జైపూర్ ఎస్సై రామకృష్ణ వారి సిబ్బందితో కలిసి.. ఎలాంటి అనుమతులు లేకుండా వైన్ షాప్ నుండి మద్యం తీసుకుని వచ్చి అమ్మకాలు జరుపుతున్న దుకాణాలపై రైడ్స్ నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, వారి ఇండ్లనే బెల్ట్ షాపులుగా చేసి అక్రమంగా అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారనే పక్కా సమాచారం మేరకు జైపూర్ పోలీసులు ఈ దాడులు చేపట్టారు. రామారావుపేట్ లోని నాలుగు ఇళ్లల్లో సుమారు రూ. 34,620 విలువ గల మద్యాన్ని పట్టుకున్న జైపూర్ పోలీసులు.. కేసు నమోదు చేశారు.