NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao: ప్రధాని మోడీని తరిమికొట్టే రోజులు వచ్చేశాయ్

Sambasiva Rao Fires

Sambasiva Rao Fires

Kunamneni Sambasiva Rao Fires On PM Modi Komatireddy Brothers: తెలంగాణలో ప్రధాని మోడీ, అమిత్ షాల ఆటలు సాగవని.. మోడీని తరిమికొట్టే రోజులు వచ్చాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు. చండూరు మండ‌లం బంగారిగ‌డ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో ఆయన మాట్లాడుతూ.. మునుగోడు అడ్డ, కమ్యునిస్టుల గడ్డ అని చెప్పారు. టీఆర్ఎస్, కమ్యునిస్టులు కలిసి తర్వాత తమకు ఎదురులేదని పేర్కొన్నారు. కమ్యునిస్టులపై రాజగోపాల్ రెడ్డి అవాకులు చెవాకులు పేల్చుతున్నారని, ఆయనలాగా తామేమీ పార్టీలు వదిలి పారిపోలేదని కౌంటర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తాను ధర్మయుద్ధం చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారని.. కోమటిరెడ్డి బ్రదర్స్ నోటి నుంచి ఆ పదం వస్తే, ధర్మమే సిగ్గుతో తలదించుకుంటుందని ధ్వజమెత్తారు.

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత అయినప్పటికీ.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా మారాడని సాంబశివరావు విమర్శించారు. క‌మ్యునిస్టులు అమ్ముడుపోయారని రాజగోపాల్ రెడ్డి అనడం సరికాదని, ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. అదుపు తప్పితే.. నాలుక చీరేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. తమకూ అభిమానులు ఉన్నారని, తామేమీ అమ్ముడుపోయి పార్టీ మారలేదని అన్నారు. నీచ సంస్కృతితో రూ. 18 వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయాడని.. అతని ఆత్మే కాదు, గౌరవం కూడా లేదని విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కి గుణపాఠం చెప్పాల్సిన కర్తవ్యం మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు ఉంద‌న్నారు. గెలిపించిన ప్రజ‌ల‌ను రాజగోపాల్ రెడ్డి మోసం చేశాడని, పార్టీ మారిన తర్వాత అతడు ప్రజలకు చేసిందేమిటి? అని ప్రశ్నించారు.

ఇక ఇదే సమయంలో బండి సంజయ్‌పై కూడా సాంబశివరావు ధ్వజమెత్తారు. దొంగ ప్రమాణాలు చేయొద్దని, అలా చేశావని తెలిస్తే న‌ర‌సింహ్మ స్వామి పేగులు తీసి మెడలో వేసుకుంటాడని అన్నారు. స్వాములు, మ‌ఠాధిప‌తులకు ఫామ్ హౌజ్‌ల్లో ఏం ప‌ని అని ప్రశ్నించారు. 8 రాష్ట్ర ప్రభుత్వాల‌ను బీజేపీ ప్రభుత్వం కూల్చేసిందని.. ఇప్పుడు తెలంగాణ మీద పడ్డారని చెప్పారు. అయితే.. తెలంగాణ గడ్డపై బీజేపీ ఆటలు సాగనివ్వమని పేర్కొన్నారు. బీజేపీ నాయ‌కుల‌కు బుద్ధి చెప్పాలని.. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మోదీని త‌రిమికొట్టాల్సిన రోజులు వచ్చాయన్నారు. భ‌విష్యత్‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్, క‌మ్యూనిస్టులు క‌లిసి ప‌ని చేస్తాయని కూనంనేని సాంబశివరావు తెలిపారు.