NTV Telugu Site icon

KCR: కేసీఆర్ చెప్పినా పట్టించుకోరా?

Online Classes

Online Classes

తెలంగాణలో గత నాలుగు రోజులుగా నాన్‌ స్టాప్‌గా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఆదివారం ప్రెస్‌ మీట్‌లో చెప్పారు. సోమవారం నుంచి బుధవారం వరకు అన్ని విద్యా సంస్థలను మూసి ఉంచాలని ఆయన ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు, కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు పాటించట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్‌లోని చాలా ఇంజనీరింగ్‌ కళాశాలలు సోమవారం ఒక్క రోజే సెలవు ఇచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా.. మూడు రోజులు సెలవు ఇవ్వాలనే సర్కారు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే తుంగలో తొక్కినట్లు సమాచారం. ఇంజనీరింగ్‌ కాలేజీలే కాదు. ప్రైవేట్‌ స్కూల్స్‌ కూడా గవర్నమెంట్‌ ఆర్డర్సంటే లెక్కలేనితనాన్ని చాటుకున్నట్లు కొంత మంది విద్యార్థులు చెబుతున్నారు. కొన్ని స్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మరికొన్ని స్కూళ్లు రోజుకి రెండు మూడు గంటలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నట్లు భోగట్టా.

హాలిడే మూడ్‌లో ఏం చక్కా ఎంజాయ్‌ చేస్తున్న పిల్లల్ని ఇలా బలవంతంగా ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట వేధించటం ఎంతవరకు సబబని కొందరు పేరెంట్స్‌ ప్రశ్నిస్తున్నారు. కొంత మంది పిల్లలు స్కూల్‌ లేదనే ఉద్దేశంతో బుక్స్‌ పక్కన పెట్టి ఇండోర్‌ గేమ్స్‌ ఆడుకుంటూ ఉంటే వాళ్ల స్వేచ్ఛను హరించటం కరెక్ట్‌ కాదని హితవు పలుకుతున్నారు. ప్రైవేట్‌ స్కూల్స్‌ అనూహ్యంగా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించటంతో పలువురు విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు లేక ఇబ్బందిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కరెంట్‌ లేక ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కాలేని పరిస్థితి నెలకొంది.

కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తూ ఎనిమిది నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఐదారు గంటల పాటు ఆన్‌లైన్‌ క్లాసులు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్ధ గంట సేపు మాత్రమే బ్రేక్‌ ఇస్తున్నారని స్టూడెంట్స్‌ వాపోతున్నారు. విద్యా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల తీరును సామాజికవేత్తలు ఖండిస్తున్నారు. వాతావరణం సహకరించకున్నా విద్యార్థులను వదిలిపెట్టరా అని మండిపడుతున్నారు.