Kalvakuntla Kavitha On SC Reservation: హైదరాబాద్‌లో ఏ ఒక్క ప్రభుత్వం కూడా కుల సంఘాలకు భూమి ఇవ్వలేదని.. 84 కుల సంఘాలకు భూములిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటారని.. వారి మాటలు పట్టించుకోవద్దని కోరారు. నిజాంపేటలోని బల్కం చెలక తండాలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత.. ఈ సందర్భంగా బాయి, భియాన్‌సే రాం రాం అంటూ లాంబడి భాషలో మాట్లాడారు. ఒక వ్యక్తిని జాగృతం చేసిన వ్యక్తి సేవాలాల్ అని.. ఆయన లాంబడి జాతికి ఆదర్శమని అన్నారు. పార్లమెంట్‌లో సేవాలాల్‌కి భారతరత్న ఇవ్వాలని తాను పార్లమెంట్‌లో చెప్పానన్నారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లు ఇవ్వడం లేదని.. అందుకే మనకు మనమే 10 శాతం రిజర్వేషన్ ఇచ్చుకున్నామని కవిత స్పష్టం చేశారు. వాట్సాప్‌లో పనికి రాని ప్రచారం చేస్తున్నారన్నారు. లాంబడిల తీజ్ పండుగకి రాష్ట్ర పండుగ చేయాలన్నా డిమాండ్‌ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కోటి చీరలు బతుకమ్మ కోసం పంపిణీ చేస్తున్నామని కవిత పేర్కొన్నారు.
అంతకుముందు మీర్‌పేట పరిధిలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బాల గంగాధర తిలక్ స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. బాల గంగాధర తిలక్ తన ఇన్సపిరేషన్ అని.. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించి, ప్రజలను ఒక దగ్గర చేర్చి.. స్వాతంత్ర్యం కోసం ఎందుకు కొట్లాడాలో బాల గంగాధర తిలక్ ప్రజలకు వివరించే వారని కవిత గుర్తు చేశారు. అది స్టడీ చేసిన తర్వాత.. తెలంగాణలో ఇలా ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చిందని, ఉద్యమ సమయంలో బతుకమ్మ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. అనంతరం విద్యార్థినిలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత శంషాబాద్ అమ్మపల్లి సీతారామ చంద్రస్వామి ఆలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కూడా కవిత పాల్గొన్నారు.
