Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు

  • ఉమ్రా యాత్రలో విషాదం
  • రియాద్ బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి
  • భార్య, పిల్లలకు గాయాలు
  • హైదరాబాద్‌లో విషాదఛాయలు
Hyderabad

Hyderabad

ఉమ్రా యాత్ర హైదరాబాదీ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులతో కలిసి ఐటీ ఉద్యోగి మహమ్మద్ యూసుఫ్ (46) సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రకు వెళ్లాడు. అక్టోబర్ 10న రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది చనిపోగా.. ఇందులో హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ యూసుఫ్ ప్రాణాలు కోల్పోగా.. భార్య, పిల్లలకు గాయాలయ్యాయి. పవిత్ర యాత్రకు వెళ్లి యూసుఫ్ ప్రాణాలు కోల్పోవడంతో హైదరాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

మహమ్మద్ యూసుఫ్ సౌదీ అరేబియాలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఉమ్రా యాత్రలో భాగంగా ఆయన తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నాడు. రియాద్ విమానాశ్రయంలో మదీనాకు వెళ్లే విమానం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఎదురుచూస్తున్న సమయంలో ఒక్కసారిగా బాంబు దాడి జరిగింది. ఈ సమయంలో దాడి కారణంగా పడిన శిథిలాలు కుటుంబ సభ్యులకు తగిలాయని.. దీంతో యూసుఫ్ ప్రాణాలు కోల్పోగా.. ఆయన భార్య, పిల్లలు, ఇతర బంధువులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

అసదుద్దీన్ ఒవైసీ
ఈ ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. యూసుఫ్ కుటుంబ సభ్యులకు అవసరమైన వైద్య సహాయం అందించడంతో పాటు, ఆయన మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సహకరించాలని భారత విదేశాంగ శాఖను కోరారు. కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, భారత దౌత్య అధికారులు వెంటనే స్పందించి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

సాయం అందిస్తామన్న జైశంకర్
ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం కూడా బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. యూసుఫ్ కుటుంబ సభ్యులకు వైద్య చికిత్స, ఇతర అవసరాల విషయంలో సహకారం అందించేందుకు భారత అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

గత కొద్దిరోజులుగా సౌదీ లక్ష్యంగా హౌతీలు దాడులు చేస్తున్నారు. విమానాశ్రయాలు టార్గెట్‌గా హౌతీలు దాడులు చేస్తున్నారు. సౌదీ సైన్యం తిప్పికొడుతున్నా.. హౌతీలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక మక్కా ఒప్పందంలో ఉన్న టర్కీ, పాకిస్థాన్ మాత్రం పట్టించుకోవడం లేదు. సౌదీకి సాయం చేసే విషయంలో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక కీలక సమయంలో ట్రంప్ హ్యాండిచ్చారు. దీంతో సౌదీ అయోమయంలో కొట్టిమిట్టాడుతోంది.