Hyderabad Floods: హైదరాబాద్ మహా నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారాంబాగ్ ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరద క్రమంగా పెరుగుతుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి ఆశ్రయం కోసం పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. ఇక, చాదర్‌ఘాట్, మలక్‌పేట రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పటికే ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునగడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ లోపల ఉన్న ప్యాసింజర్లను పోలీసులు, హైడ్రా సిబ్బంది సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు.
Read Also: Vetrimaaran-Simbu : శింబు కోసం వెట్రిమారన్ తొలిసారి ఇలా..!
ఇక, ఎంజీబీఎస్ బస్ డిపో ఫ్లైఓవర్ నుంచి చాదర్‌ఘాట్ వరకు మూసీ నదిలో భారీ నీటి ప్రవాహం కొనసాగుతుంది. పోలీసులు, జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ రిస్పాన్స్ టీమ్స్, నీటి పారుదల అధికారులు నిరంతర పర్యవేక్షిస్తున్నారు. నీటి మట్టాలు తగ్గే వరకు లోతట్టు ప్రాంతాలు, నదీ తీర మార్గాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచనలు జారీ చేశారు. మరోవైపు, జియాగూడ, పురానాపూల్ ప్రాంతాల్లో భారీ వరద నీరు చేరింది. ఇప్పటికే ఈ రూట్లను అధికారులు మూసివేశారు. మూసీని ఆనుకొని ఉన్న జియాగూడ బస్తీలు, కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే, పురానాపూల్‌లోని శివాలయం నీట మునిగిపోయింది. ఆలయంలో ఉన్న పూజారి కుటుంబం బయటకు రాలేక, సహాయం కోసం ఆలయ పైభాగానికి ఎక్కి కేకేలు వేశారు.
