NTV Telugu Site icon

BSNL Services: ప్రజలకు బిఎస్ఎన్ఎల్ సేవలు.. ఉద్యోగుల అవగాహన ర్యాలీ..

Bsnl

Bsnl

BSNL Services: అతి తక్కువ ధరలతో బిఎస్ఎన్ఎల్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ ఏరియా-1 ఏజీఎం ఎ.బాలకృష్ణ పేర్కొన్నారు. బిఎస్ఎన్ఎల్ సేవలపై శుక్రవారం ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. టెలికాం రంగంలో ప్రైవేటు సంస్థల కంటే బిఎస్ఎన్ఎల్ మెరుగైన సేవలను అందజేస్తుందన్నారు. ప్రైవేట్ సంస్థలు ప్లాన్లరేట్లను భారీగా పెంచినప్పటికీ, బిఎస్ఎన్ఎల్ పాత రేట్లని కొనసాగిస్తుందన్నారు. ఇటీవల నెల రోజుల్లో 2.31 లక్షల మంది బిఎస్ఎన్ఎల్ సేవలను కొత్తగా పొందారని ఆయన వెల్లడించారు. దీంతో మొబైల్ సేవలతో పాటు ఫైబర్ నెట్వర్క్ లో బిఎస్ఎన్ఎల్ సేవలను మరింత విస్తృతపరిచామన్నారు.

Read also: Nagarjuna Sagar: సాగర్‌ కు కృష్ణమ్మ పరవళ్లు.. చూసేందుకు పర్యాటకుల సందడి..

ఇక ఇంటింటికి ఫైబర్ నెట్వర్క్లో 20 ప్లాన్లతో ఇంటర్నెట్ సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో బిఎస్ఎన్ఎల్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆత్మ నిర్బంధ్ భారత్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ సరికొత్త పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతుందన్నారు. ఈ సందర్భంగా ఈసీఐఎల్ లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి రాధిక చౌరస్తా, ఏ.ఎస్.రావు నగర్ మీదుగా తిరిగి ఈసీఐఎల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఏజీఎం ఏ ఎన్ వి ఏ ప్రభాకర్ రావు, ఎస్ డి ఈ శ్రీ కృష్ణ, బిఎస్ఎన్ఎల్ అధికారులు కే రాజేశ్వరరావు, చంద్రశేఖర్, రఘునందన్, సంతోష్ బాబు, రాకేష్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
Telangana Crime: క్షణికావేశం.. ఒకరు కొడుకును చంపితే.. మరొకరు తండ్రిని హతమార్చాడు..