Hyderabad Police Caught Huge Cash: ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో పోలీసులు, ఎన్నికల అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కోట్లలో రూపాయలు, కేజీల కొద్ది బంగారం, వెండి బయట పడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో తనిఖీ చేపట్టిన పోలీసులు ఆరున్నర కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని అప్పా జంక్షన్ వద్ద శనివారం పోలీసులు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అటుగా వస్తున్న 6 కార్లను అడ్డుకుని సోదాలు నిర్వహించారు. ఈ కార్లలో నోట్ల కట్టలతో ఉన్న భారీ సూటు కేసు, బ్యాగులను పోలీసులు గుర్తించారు. వాటిలో మొత్తం రూ. 6.5 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. ఆ డబ్బుకు సంబంధించిన ఎలాంటి రశీదు, వివరాలు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. కాగా పట్టుబడ్డ నగదు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేతదని తెలుస్తోంది. ఆయన మొదటిసారిగా ఖమ్మం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సమాచారం.