NTV Telugu Site icon

PM Narendra Modi: మోడీ తెలంగాణ పర్యటన.. మూడంచెల భద్రత ఏర్పాటు

Pm Modi Tour

Pm Modi Tour

Huge Security Arrangements In Ramagundam For PM Modi Tour: ఎరువుల ఫ్యాక్టరీ(ఆర్ఎఫ్‌సీఎల్)ని ప్రారంభించేందుకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ పెద్దపల్లి జిల్లాలోని రామగుండంకు విచ్చేయనున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు ఎస్‌పీజీ, ఎన్ఎస్‌జీ, ఎన్‌డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. సివిల్ విభాగం నుండి 300 పోలీస్ అధికారులతో పాటు 2650 మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దింపారు. ఇద్దరు సీపీలు, ఎనిమిది ఏసీపీల పర్యవేక్షణలో ఈ భద్రతా ఏర్పాట్లను నిర్వహించారు. అంతేకాదు.. రామగుండం, గోదావరిఖని పట్టణాల్లో పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా.. పరిచయం లేని వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ప్రజలను పోలీసులు సూచిస్తున్నారు.

మరోవైపు.. ఎన్‌టీపీసీ టౌన్‌షిప్ నుండి ఆర్ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌కు నేరుగా వెళ్లేందుకు ఒక ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ తరుణంలోనే ఎన్టీపీసి టౌన్‌షిప్, ఆర్ఎఫ్‌సీఎల్‌లను ఎస్‌పీజీ తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ నుండి ఎన్‌టీపీసీలోని టౌన్‌షిప్‌లో జరిగే బహిరంగ సభకు మోడీ వెళ్లనున్నారు. ఆర్ఎఫ్‌సిఎల్ ప్రారంభించిన అనంతరం.. వర్చువల్ ద్వారా కొత్తగూడెం నుంచి సత్తుపల్లి రైల్వేలైన్‌లను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పలు జాతీయ రహదారుల విస్తరణకు గాను శంకుస్థాపనలలో మోడీ పాల్గొననున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న మోడీ.. మధ్యాహ్నం 12.25 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో తెలంగాణకు బయల్దేరుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టు‌లో దిగి.. ఆ తర్వాత బీజేపీ స్వాగత సభలో పాల్గొంటారు.