Site icon NTV Telugu

Heavy Rains In Telangana: మళ్లీ కుండపోత వర్షాలు.. ఐదు జిల్లాలకు ‘రెడ్’ అలర్ట్​

Heavy Rains In Telangana

Heavy Rains In Telangana

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు భాగ్యనగరం సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్డాయి. నగరవాసులతంగా ఇంకా ఐదురోజుల పాటు అప్రమత్తంగా వుండాలని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్‌ నగరంతో పాటు మహబూబ్‌ నగర్‌, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్ అలర్ట్‌ ఉంటుందని ప్రకటించింది. కాగా.. 4 రోజులు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న వెల్లడించారు. ఈనేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిదని సూచించారు. ఇక మరోవైపు రాష్ట్రంలో వానలు విజృంభించడంతో వాగులు, వంకలు ఉప్పొంగాయి.

భద్రాద్రి జిల్లాలో పిడుగుపాటుకు ఒక మహిళ మృతిచెందింది. ఇక వైరానదిలో ఒకరు గల్లంతుకాగా.. పలువురు కూలీలు వరదల్లో చిక్కుకున్నారు. స్కూల్‌ బస్సు వరదనీటిలో చిక్కుకుంది.

హైదరాబాద్‌లో దాదాపు 2 వేల కాలనీలు నీట మునిగినట్లు జీహెచ్‌ఎంసీ అంచనా వేసింది. ఎల్‌బీనగర్‌ నుంచి సెరిలింగంపల్లి వరకు రోడ్లు చెరువులను తలపించాయి. నిజాంపేట, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. నిజాంపేట్ భండారీ లేఅవుట్, బృందావన్ కాలనీ, బాలాజీనగర్, శ్రీనివాసకాలనీ, బాచుపల్లి, రాజీవ్ గాంధీనగర్, జయదీపిక ఎస్టేట్ తదితర ప్రాంతాల్లో డ్రెయిన్లు లేకపోవడంతో రోడ్లపై నడుము లోతు నీరు నిలిచింది. స్కూల్ బస్సులు, కార్లు నిలిచిపోయాయి.

చార్మినార్ చుట్టుపక్కల రోడ్లు నీట మునిగాయి. కూకట్ పల్లి, మూసాపేట, జీడిమెట్ల, బాలానగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. బేగంపేట ప్రాంతంలో నాలా పొంగి పొర్లడంతో కాలనీలు నీట మునిగాయి. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుందని ఇంజినీర్లు తెలిపారు. హైదరాబాద్ నగర శివారు బాచుపల్లిలో 11.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బాటసింగారంలోని పండ్ల మార్కెట్‌లో వరద ఉధృతికి పళ్లన్నీ కొట్టుకుపోయాయి.

సూర్యాపేటతో పాటు నూతనకల్, నడిగూడెం, పెన్‌పహాడ్, హుజూర్‌నగర్, కోదాడ, నల్గొండ, డిండి, దేవరకొండ, మిర్యాలగూడలో భారీ వర్షం కురిసింది. మోతె మండలంలోని పలు ప్రాంతాల్లో పత్తి పంట నీటిలో మునిగిపోయింది. మూసీ ప్రాజెక్టులోకి 2 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరింది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంతో పాటు భువనగిరి, రామన్నపేట, గుండాల ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

మహబూబాబాద్, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో వరి పొలాలు, పత్తి పొలాలు నీట మునిగాయి. ములుగు జిల్లా తాడ్వాయి-పస్రా మధ్య జాతీయ రహదారి 163పై ట్రాఫిక్ స్తంభించింది. జలగలంచ నది ఉప్పొంగి జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాన్వాయ్‌ శుక్రవారం రాత్రి ఏటూరునాగారం వాగు వద్ద ఆగింది. అలా నార్లాపురం, మేడారం మీదుగా తాడ్వాయి చేరుకుని ఏటూరునాగారం మీదుగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం వెళ్లారు.

India Vs West Indies: ధావన్ సెంచరీ మిస్.. తొలి వన్డేలో భారీ స్కోరు చేసిన టీమిండియా

Exit mobile version