Site icon NTV Telugu

Bandi Sanjay: గన్‌పార్క్‌ వద్ద బండిసంజయ్‌ దీక్ష.. భారీగా పోలీసులు మోహరింపు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుతం లీకేజీ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపైమరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలని డిమాండ్ చేస్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. బండి సంజయ్ మొదట బీజేపీ నాయకులతో కలిసి నాంపల్లిలోని గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. గన్ పార్క్ నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ వెళ్తున్న బండి సంజయ్‌ ను పోలీసుల అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతల నడుమ బండి సంజయ్ గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అయితే బండి సంజయ్ వద్దకు డీసీపీ, పోలీసు అధికారులు రాగా.. పోలీస్ గో బ్యాక్ అంటూ కార్యకర్తల నినాదాలు చేయడంతో.. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. గన్ పార్క్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి.

Read also: MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు.. గెలుపోటముల మీదా చెల్లని ఓట్ల ఎఫెక్ట్‌

బండిసంజయ్‌ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. గ్రూప్ 1 ప్రశ్నా పత్రం లీక్ చేసి లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకున్నాడని సీఎంపై బండి సంజయ్ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఇంత జరుగుతున్నా నోరు మెదపని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత అని ప్రశ్నించారు. పేపర్ లీక్ పై సీఎం తక్షణమే స్పందించి సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక.. ఉమ్మడి మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి విజయం టీచర్లలో పేరుకుపోయిన ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి టీచర్ల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. నియంతృత్వ, నియంత పోకడలకు పోయే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు. రాబోయే సాధారణ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే పునరావృతం అవుతాయన్న విశ్వాసాన్ని ఉపాధ్యాయులు అందించారన్నారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయ లోకం ఈ ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వాన్ని పడగొట్టడనికి మా వెంట నడుస్తారని ఆశిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన బిజెపి అభ్యర్థి ఏవిఎన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మాపై ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మేం మరింత ఉధృతంగా పోరాడేందుకు ఈ విజయం ప్రేరణనిస్తుందని బండిసంజయ్ పేర్కొన్నారు.
Comedian Khyali Saharan: మద్యం మత్తులో యువతిపై హాస్యనటుడు అత్యాచారం

Exit mobile version