Harish Rao Counters To BJP Over Kaleswaram Project Issue: కాళేశ్వరం ప్రాజెక్ట్ పని అయిపోయిందంటూ.. గోబెల్స్ ప్రచారానికి బీజేపీ పాల్పడుతోందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాళేశ్వరంలో మొత్తం 21 పంప్‌హౌస్‌లు ఉంటే.. రెండు పంప్‌హౌస్‌లకు మాత్రమే నీళ్లు వచ్చాయన్నారు. కాళేశ్వరం మొత్తం మునిగినట్టు చెప్తూ.. బీజేపీ రాక్షస ఆనందం పొందుతోందని విమర్శించారు. ఇప్పటికీ కాళేశ్వరంలో పంప్‌హౌస్‌లు పని చేస్తున్నాయన్నారు. దెబ్బతిన్న రెండు పంప్‌హౌస్‌ల మరమ్మత్తుల బాధ్యత ఏజెన్సీదే అని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. నెల నుంచి నెలన్నర లోపలే కాళేశ్వరం ప్రాజెక్టు 100 శాతం రన్నింగ్‌లోకి వస్తుందన్నారు.
పార్లమెంట్ సాక్షిగా.. ప్రధాని మోదీ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్‌కు కితాబిచ్చారని హరీశ్ రావు గుర్తు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో హైదరాబాద్ నీటి సమస్య తీరిందని, కాళేశ్వరం ఫలితాలు అందుతున్నాయని నితిన్ గడ్కరీ కూడా చెప్పారన్నారు. సీడబ్ల్యూసీ (CWC) చైర్మన్ మసూద్ హుస్సేన్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ‘ల్యాండ్‌మార్క్’ అన్నారని.. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈ ప్రాజెక్ట్‌ని చూసి ‘ఇంజనీరింగ్ మార్వెల్’ అని కొనియాడారన్నారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రమంత్రి షెకావత్ గతంలో అన్నారన్నారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని మెచ్చకున్న నోళ్లతోనే పుచ్చపోయిన మాటలు మాట్లాడుతున్నారంటూ హరీశ్ రావ్ ఆగ్రహించారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పిన నిజాలను.. ఇప్పుడు అబద్ధాలుగా ప్రచారం చేస్తున్నారన్నారు. వారిది నోరు అనుకోవాలా? మోరి అనుకోవాలా? అంటూ ప్రశ్నించిన హరీశ్.. పదవుల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
బీజేపీ సర్కార్ తప్పులను సీఎం కేసీఆర్ ఎండగడుతుండటం వల్లే.. బీజేపీ నేతలు ఇలా అవినీతి ఆరోపణలు చేస్తున్నారని హరీశ్ రావు చెప్పారు. టీఆర్ఎస్‌ను బద్నాం చేసేందుకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అంటున్నారని, ఇదంతా ఒక కుట్ర అని వెల్లడించారు. ఇక ఇదే సమయంలో.. ప్రకృతి వైపరీత్యం వల్ల గోదావరికి 108.2 మీటర్ల వరద నమోదు అయ్యిందన్నారు. 1986లో గోదావరి కి వచ్చిన వరదల కంటే.. మొన్న ఎక్కువ వరద వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి యాసంగి పంటకు నీళ్లు ఇస్తామన్నారు. యాసంగిలో పండిన పంటను కొనేందుకు ఏర్పాట్లు చేసుకోండని బిజెపి సర్కార్‌ను సూచించారు. తెలంగాణలో ఏడేళ్ళలో వరి పంట ఉత్పత్తి 220 శాతం పెరిగిందని హరీశ్ రావు వెల్లడించారు.
