Goa Drug Kingpin Edwin Nunes Approached Telangana High Court For Anticipatory Bail: గోవా కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తోన్న ప్రధాన నిందితుల్ని హైదరాబాద్ పోలీసులు ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటోన్న సంగతి తెలిసిందే! ఇప్పటికే హెచ్-న్యూ (H-NEW) పోలీసులు డ్రగ్ కింగ్‌పిన్ జాన్ స్టీఫెన్ డిసౌజా అలియాస్ స్టీవ్‌ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో డ్రగ్ కింగ్‌పిన్ అయిన ఎడ్విన్‌ని సైతం అదుపులోకి తీసుకోవాలని పక్కా వ్యూహం రచించారు. అయితే.. అతడు మరో ప్లాన్ వేసి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఎడ్విన్‌ని అదుపులోకి తీసుకోవడం కోసం H-NEW పోలీసులు గోవా పోలీసుల సహకారం కోరారు. దీంతో వాళ్లు అతని నివాసానికి వెళ్లగా.. అక్కడున్న వాళ్లు ఎడ్విన్‌కి కరోనా సోకిందని, ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్తూ ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే.. అది ఫేక్ అని తేలడంతో ఎడ్విన్ నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో దాడులు చేశారు. కానీ, అతడు అప్పటికే తప్పించుకున్నాడు. దీంతో.. అతని కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు.
ఆల్రెడీ స్టీవ్ పట్టుబడ్డాడు కాబట్టి, తనని కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో ఎడ్విన్ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాడు. హైదరాబాద్ పోలీసులు తనని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. కాగా.. స్టీవ్ తరహాలోనే ఎడ్విన్ సైతం గోవా కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఇతనికి వందల సంఖ్యలో ఏజెంట్లు ఉన్నారు. ఇతడు గోవాలో కర్లీస్ పబ్‌ను నిర్వహిస్తున్నాడు. ఇప్పుడితను పరారీలో ఉండడంతో, అరెస్ట్ చేసేందుకు స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు.. ఇటీవల అదుపులోకి తీసుకున్న స్టీవ్ కస్టడీ కోరుతూ హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
