NTV Telugu Site icon

Rental Houses: హైదరాబాద్‌లో అద్దె ఇండ్లకు ఫుల్ డిమాండ్.. ఓఆర్ఆర్ దాటి వెళ్ళాల్సిందే..

Hyderabad No To Let

Hyderabad No To Let

Rental Houses: భాగ్యనగరంలో అద్దె ఇల్లు దొరకడం సామాన్యులకు కష్టంగా మారింది. కరోనా తర్వాత నగరంలో టూలెట్ బోర్డులు కనిపించాయి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రధాన నగరంతోపాటు నగర శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. 10 కాలనీలు తిరిగినా.. ఎక్కడా ఖాళీ లేదు. సింగిల్, డబుల్ బెడ్ రూం ఇండ్లు అందుబాటులో లేకపోవడంతో అద్దెకు ఇల్లు కావాలనుకునే సామాన్యులు ఔటర్ రింగ్ రోడ్డు దాటి బయటి ప్రాంతాలకు తరలిపోతున్నారు. కరోనాకు ముందు హైదరాబాద్‌లో అద్దె ఇళ్లు పుష్కలంగా ఉండేవి, ధరలు కూడా తక్కువగా ఉండేవి. కరోనా తరువాత, చాలా మంది ప్రజలు నగరాన్ని విడిచిపెట్టి వారి స్వంత ప్రాంతాలకు వెళ్లారు. కరోనా తగ్గిన తర్వాత ప్రజలు నగరానికి తిరిగి రావడం ప్రారంభించారు. అనేక ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎత్తివేయడం, పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు నగరాలకు వెళ్లడంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హైటెక్ సిటీ వంటి ఐటీ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో డబుల్ బెడ్ రూం అద్దె రూ.30 వేల నుంచి రూ.33 వేల వరకు ఉంది. సింగిల్ బెడ్ రూమ్ కూడా రూ. 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు ఉంటుంది. దీంతో చాలా మంది శివారు ప్రాంతాలకు తరలిపోతున్నారు.

Read also: Sitting all day: రోజంతా కూర్చొనే ఉంటున్నారా? అయితే..

ఇప్పుడు శివారు ప్రాంతాల్లో సింగిల్ బెడ్ రూం ఇళ్ల అద్దె ప్రస్తుతం రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకు ఉంది. డబుల్ బెడ్ రూం అద్దె రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంది. మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు అద్దెలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు మారుతున్నారు. దీంతో శివారు ప్రాంతాల్లో కూడా ఇళ్లు అద్దెకు దొరకడం లేదు. నగర శివారు ప్రాంతాలైన బోడుప్పల్, పీర్జాదిగూడ, హయత్ నగర్, ఎల్బీనగర్, నిజాంపేట్, బండ్లగూడ జాగీర్ తదితర ప్రాంతాల్లో గతేడాది వరకు ఎక్కడ చూసినా టోల్ బోర్డులే వెలిశాయి. నగరంలో పనిచేసే చిన్నతరహా కార్మికులు ఎక్కువగా శివారు ప్రాంతాల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. అపార్ట్‌మెంట్లు కాకుండా విలాసవంతమైన ఇళ్లు అద్దెకు లభిస్తాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. కొందరు నిర్మాణ దశలోనే యజమానులతో మాట్లాడి అడ్వాన్సులు ఇస్తున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక అక్కడికి మారుతున్నారు. నగర శివారు ప్రాంతాల నుంచి ఐటీ ప్రాంతాలకు వెళ్లడం కష్టమని భావించిన కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు విదేశాల్లో మాదిరిగా డబుల్ , ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను పంచుకుంటున్నారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలతో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు పేయింగ్ గెస్ట్‌లుగా ఉంటూ అద్దె భారాన్ని తప్పించుకుంటున్నారు. అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడంతో యజమానులు ఏటా అద్దెలు పెంచుతున్నారు. భవిష్యత్తులో ఔటర్ రింగ్ వెలుపల కూడా అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.