NTV Telugu Site icon

Free WiFi: మేడారం జాతరలో ఉచిత వైఫై సేవలు.. 15 నుంచి 25 వరకు..

Medaram Free Wifi

Medaram Free Wifi

Free WiFi: మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు దేశ, విదేశాల నుంచి సుమారు కోటి మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగే ఈ జాతరలో కమ్యూనికేషన్ సేవలు ఎంతో కీలకం కానున్నాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ నుండి ఇంటర్నెట్, వై-ఫై సేవలు చాలా ముఖ్యమైనవి. సరైన సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడంతో అక్కడికి వెళ్లే భక్తులకు తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో మేడారం మహాజాతరలో మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సిద్ధమైంది. జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. భక్తులు అధికంగా ఉండే 16 ప్రధాన ప్రాంతాల్లో ప్రజలందరూ ఉచితంగా వైఫై సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఇప్పటికే చర్యలు ప్రారంభించారు.

16 స్థానాల్లో హాట్ స్పాట్ కేంద్రాలు..

ఇంటర్నెట్ సేవలను భక్తుల చేతికి అందించేందుకు బీఎస్ఎన్ఎల్ మేడారం మహాజాతరలో 16 చోట్ల హాట్ స్పాట్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు గట్టమ్మ గుడి, కొత్తూరు రోడ్డు, కొత్తూరు పాఠశాల, ఊరట్టం క్రాస్‌రోడ్డు, కాజ్‌వే, రెడ్డిగూడెం పాఠశాల, హరిత హోటల్‌, నార్లాపూర్‌, ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల, ఐటీడీఏ గెస్ట్‌ హౌస్‌, బస్టాండ్‌, వాచ్‌ టవర్‌, ఆసుపత్రులు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్‌, ములుగు ప్రవేశద్వారం లో. మేడారంలోని వరి పొలాల్లో హాట్‌స్పాట్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆయా కేంద్రాల్లో పనులు కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ హాట్ స్పాట్ సెంటర్లలో వంద అడుగుల లోపు ఉన్న ఏ నెట్‌వర్క్ యూజర్ అయినా సులభంగా లాగిన్ అయి వైఫై సేవలను ఉపయోగించుకోవచ్చు. 10 నుండి 20 Mbps వేగంతో 1 GB వరకు డేటాను ఉపయోగించవచ్చు. గత జాతర సందర్భంగా ప్రభుత్వం ఈ ఉచిత వైఫై సేవల కోసం సుమారు రూ.20 లక్షలు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు.

15 నుంచి 25 వరకు సేవలు..

మహాజాతర మేడారంలో ఈ నెల 15 నుంచి బీఎస్ఎన్ఎల్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర జరగనుండగా, 25వ తేదీ వరకు జాతర ముగిసే వరకు వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి. BSNLకి సంబంధించిన అన్ని రకాల సేవలను పర్యవేక్షించడానికి మూడు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఆయా బృందాల్లోని 20 మంది అధికారులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ కనెక్టివిటీ, సిగ్నలింగ్ వ్యవస్థను పర్యవేక్షించి ఎలాంటి లోపాలు లేకుండా చూస్తారు. మేడారం జాతరలో బిఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌లు కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. రూ.249 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 45 రోజుల పాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత అవుట్‌గోయింగ్, ఇన్‌కమింగ్ కాల్స్ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.
PM Modi: నేడు గోవాలో ప్రధాని పర్యటన.. ‘ఇండియా ఎనర్జీ వీక్’ను ప్రారంభించనున్న మోడీ