NTV Telugu Site icon

ఈట‌ల రాజీనామా మ‌రింత జాప్యం..!

Etela Rajender

మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఖ‌రారైంద‌ని.. శుక్ర‌వారం రోజు ఆయ‌న రాజీనామా చేయ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రిగింది.. కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆయ‌న రాజీనామా విష‌యంలో మ‌రింత జాప్యం జ‌రిగేలా ఉంది… ముందుగా నిర్ణ‌యించిన‌ట్టుగా హైద‌రాబాద్‌లో రేపు మ‌ధ్యాహ్నం ఈట‌ల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడ‌తారు.. కానీ, రాజీనామా మాత్రం చేయ‌ర‌ని తెలుస్తోంది.. రేపు రాజీనామా చేసి.. వ‌చ్చే వారం ఢిల్లీ వెళ్లి ఆయ‌న బీజేపీలో చేర‌తార‌నే ప్ర‌చారం ఉంది.. అయితే,, ఆయ‌న ఢిల్లీకి వెళ్తే ముందే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్ న‌డుస్తోంది.. కాగా, ఈట‌లపై వ‌చ్చిన భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించాయి.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాలకు చెందిన రైతుల భూముల‌ను ఈటల క‌బ్జా చేశార‌నే ఆరోప‌ణ‌లు రాగా.. ఆ త‌ర్వాత ఆయ‌న మంత్రి ప‌ద‌వి పోయింది.. ఇక‌, త‌న‌పై ఏదో జ‌రుగుతోంద‌ని గ్ర‌హించిన ఈట‌ల‌.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వేదిక‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డ్డారు.. కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. చివ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపే ఆయ‌న మొగ్గు చూపారు.. ఢిల్లీలో మ‌కాం వేసి మ‌రి.. త‌న‌కు ఉన్న అనుమానాల‌ను నివృత్తిచేసుకున్నారు.. కానీ, ఎమ్మెల్యే పదవికి ఇప్పటికప్పుడు రాజీనామా చేసినా పెద్దగా ప్రయోజనం లేద‌నే అభిప్రాయంలో ఈట‌ల ఉన్న‌ట్టు తెలుస్తోంది.. ఇప్పుడు రాజీనామా చేసినా.. వెంట‌నే ఎన్నికల సంఘం ఉప ఎన్నిక‌లు పెట్ట‌క‌పోవ‌చ్చు అని.. దీంతో.. పొలిటిక‌ల్ హీట్ కాస్త త‌గ్గిపోతుంద‌నే భావ‌న‌లో ఉన్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.