రాష్ట్రంలో ఫెర్టిలిటీ సెంటర్లు, సరోగసీ కేంద్రాల పేరుతో కొందరు కేటుగాళ్లు సాగిస్తున్న అక్రమ దందాలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వహణపై వస్తున్న వరుస ఫిర్యాదులు, అక్రమాలపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద సంచలన విషయాలు వెల్లడించారు. వ్యాపార కోణంలో అమాయక మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆస్పత్రుల తీరుపై మండిపడ్డారు. ఇప్పటివరకు జరిగిన విచారణలో నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లు తేలిందని, త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
డోనర్స్ వివరాలు గల్లంతు.. ఏజెంట్లతో దందా
రాష్ట్రంలోని పలు ఫెర్టిలిటీ సెంటర్లలో ఎలాంటి అర్హతలు, క్వాలిఫికేషన్స్ లేకున్నా ఇష్టారాజ్యంగా దందా నడిపిస్తున్నారని నేరేళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా అసలు డోనర్స్ ఎవరు? ఏజెంట్ల ద్వారా ఎవరికి ట్రీట్మెంట్ చేశారు? అనే వివరాలు అడిగితే యాజమాన్యాలు కనీసం సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదన్నారు. కేవలం డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌ను కొందరు ఒక వ్యాపారంగా మార్చుకున్నారని మండిపడ్డారు. విచారణకు రావాలని ఫెర్టిలిటీ సెంటర్ల మెనేజ్‌మెంట్‌ను ఆదేశిస్తే, కనీసం బాధ్యత లేకుండా కేవలం కింది స్థాయి సిబ్బందిని పంపించి చేతులు దులుపుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఒక్క డోనర్ వివరాలు ఒరిజినల్ కాదు
ఫెర్టిలిటీ సెంటర్లు సమర్పించిన రికార్డులపై ఆరా తీయగా దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయని చైర్ పర్సన్ తెలిపారు. ఇప్పటివరకు వారు అందజేసిన ఫైళ్లలో ఏ ఒక్క డోనర్ వివరాలు కూడా ఒరిజినల్‌గా, జెన్యూన్‌గా లేవని తేలింది. అన్నీ తప్పుడు సమాచారంతో కూడిన నకిలీ పత్రాలేనని స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హెల్త్ కమిషనర్‌తో ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ఈ తరహా అక్రమాలను అరికట్టడానికి అమలు చేస్తున్న సిస్టమ్‌పై చర్చించామని, విచారణ తర్వాత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోసారి తప్పుడు వివరాలిస్తే ఊరుకునేది లేదు
ఈ మొత్తం అంశంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి, ముఖ్యమంత్రితో చర్చించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నేరేళ్ల శారద స్పష్టం చేశారు. ఫెర్టిలిటీ సెంటర్ల యాజమాన్యాలను మరోసారి విచారణకు పిలిచామని, ఆ సమయంలో కూడా మళ్లీ అవే తప్పుడు వివరాలు ఇస్తూ, కింది స్థాయి సిబ్బందిని పంపిస్తే తమ చర్యలు ఏ స్థాయిలో ఉంటాయో చూపిస్తామని హెచ్చరించారు. మహిళల జీవితాలతో ఆడుకునే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బాధితులందరికీ మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

