జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ పోలీస్ అధికారిని అంటూ మోసాలు పాల్పడుతున్న అల్లం కిషన్ రావును (రిటైర్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్) అరెస్ట్ చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ వెల్లడించారు. స్థల వివాదం పరిష్కరిస్తానని కరీంనగర్‌కు చెందిన అబ్బాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద 39 లక్షలు తీసుకొని బెదిరింపులకు పాల్పడ్డాడని, జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలోని స్థలాల వ్యవహారంలో కిషన్ రావు ఇన్వాల్వ్ అయ్యాడని ఏసీపీ తెలిపారు. బాధితుడు అబ్బాస్ రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసుల దర్యాప్తు జరిపారని ఆయన వెల్లడించారు. యూసుఫ్ గూడా పోలీస్ బెటాలియన్ లో నివసిస్తున్న కిషన్ రావుని అరెస్టు చేశామని, కిషన్ రావు వద్ద ఉన్న నాలుగు ఎయిర్ గన్స్ సీజ్ చేసామని ఆయన పేర్కొన్నారు.
కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇతర కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని గతంలో నిరుద్యోగుల దగ్గర నుండి డబ్బు తీసుకుని కిషన్‌రావు మోసం చేసాడని, అతని వద్ద నుండి రద్దు చేయబడిన నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలో కూడా ఇతనిపై పలు కేసులు ఉన్నాయని, ఆయుధాలతో అక్రమ దందా కు పాల్పడుతు ఘటనలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిషన్ రావు సస్పెండ్ అయ్యాడని ఆయన తెలిపారు. అయితే లక్ష్మణ్ అనే మరో వ్యక్తి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, లక్ష్మణ్ అనే వ్యక్తి అబ్బాస్ కు కిషన్ రావును పరిచయం చేశాడని, లక్ష్మణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
