Errabelli Dayakar Rao Fires On Bandi Sanjay: కేసీఆర్ కుటుంబం మచ్చలేని కుటుంబమని.. ఆ కుటుంబాన్ని మాటంటే ప్రజలు క్షమించరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు హెచ్చురించారు. బతుకమ్మ చరిత్రని విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవిత సొంతమని, అలాంటి కవితకు మీరిచ్చే గౌరవం ఇదా? అంటూ నిలదీశారు. ఆమెపై కావాలనే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని.. కేసీఆర్ పరిపాలనపై అక్కసుతోనే ఈ పనికిమాలిన పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. మీరు వేసే కేసులు.. అలాగే ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో మీ బుద్ధి మారడం లేదని, మీ అరాచకాలు తెలంగాణలో సాగవని అన్నారు. ఈడీ పేరుతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. తాటాకు చప్పులకు తాము భయపడమని తెలిపారు.
తెలంగాణ ప్రజలు నికార్సయిన ఉద్యమకారులన్న ఎర్రబెల్లి.. దేవరుప్పులలో నెలకొన్న గొడవకు బీజేపీ కార్యకర్తలే కారణమని అన్నారు. తాము దాడి చేయాలని తలచుకుంటే.. మీరు దేనికీ సరిపోరని ఎద్దేవా చేశారు. సామాన్య ప్రజలు అడిగితే దాడి చేస్తున్నారన్నారు. కిరాయి గుండాల తెచ్చుకొని యాత్ర చేస్తున్నారని.. దాడి చేసి పేరు సంపాదించుకోవాలి చూస్తున్నారని చెప్పారు. బండి సంజయ్ పాదయాత్రకు జనం నుంచి ఆదరణ లేదని చెప్పిన ఆయన.. నీకు బౌన్సర్లు ఎందుకు? నీ వెంట కిరాయి గూండాలెందుకు? అని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మత చిచ్చు పెడుతున్నాడని, ప్రధాని మోదీ సైతం ఆయనకు ట్రైనింగ్ ఇచ్చాడని అభిప్రాయపడ్డారు.
ఇంకా రెచ్చగొట్టు అని, ఒక దెబ్బ తిని అయినా రెచ్చగొట్టాలని బండి సంజయ్‌కు మోదీ సూచించారని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. నీ అయ్యా, అవ్వకు సరిగా సేవ చేయలేని నువ్వు.. గుజరాతి వ్యక్తి బూట్లు మోసి తెలంగాణ ఆత్మ గౌరవం తాకట్టు పెట్టావంటూ బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, కేసీఆర్ కుటుంబం జోలికి వస్తే విడిచిపెట్టేదే లేదని వార్నింగ్ ఇచ్చారు.
