టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది. రూ.1064 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో అధికారులు తనీఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నామా నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేశారు. మధుకాన్ కంపెనీ పేరుతో బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వాటిని విదేశీ కంపెనీలకు మళ్లించారని అభియోగాలు వచ్చాయి. నామాతో పాటుగా రాంచి ఎక్స్‌ప్రెస్ వే సీఎండీ శ్రీనివాసరావు, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృథ్వీతేజ ఇళ్లపై కూడా ఈడీ దాడులు చేసింది. అటు 2019లో నామాపై సీబిఐ కేసు నమోదు చేసిన విషయంతెలిసిందే. కాగా 2020లో సీబీఐ చార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది. చార్జ్‌షీట్‌లో మధుకాన్ ఇన్ఫ్రా, మధుకాన్ ప్రాజెక్ట్, మధుకాన్ టోల్‌వే ఆడిటర్లను నిందితులుగా చేర్చింది.
రాంచీ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులో నిధులను మళ్లించడంతో ఈడీ రంగంలోకి దిగింది. 2011లో రాంచీ-జంషెడ్‌పూర్ హైవే కాంట్రాక్ట్ పనులను మధుకాన్ కంపెనీ చేజిక్కించుకుంది. ఈ ప్రాజెక్టుకోసం కంపెనీ రూ.1100 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది. ఇందులో 264 కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయని కంపెనీపై అభియోగాలు రావడంతో సీబీఐ 2019లో కేసు నమోదు చేసింది. సీబీఐ విచారణలో మధుకాన్ ప్రాజెక్ట్ నుంచి నిధులు మధుకాన్ ఇన్ఫ్రా, మధుకాన్ టోల్ హైవేలకు మళ్లించినట్టు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నది.