టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు మరింత ముమ్మరం చేయనుంది. గత 20 రోజులుగా మనీలాండరింగ్ కేసలో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. విదేశాల నుండి డ్రగ్స్ దిగుమతి చేసిన కెల్విన్ బ్యాంక్ ఖాతాలతో నటుల స్టేట్ మెంట్‌లను పరిశీలించింది. ఎక్సైజ్ శాఖ విచారణలో ఇప్పటికే 16 మంది సెలబ్రిటీలకు క్లిన్ చిట్ దక్కింది. అయితే ఎక్సైజ్ విచారణతో సంబంధం లేకుండా ఈడీ దర్యాప్తు కొనసాగించింది. ఇక, ఇవాళ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తరుణ్ విచారణ ముగిసింది. ఈడీ కార్యాలయంలో 8 గంటల పాటు తరుణ్‌ను విచారించారు అధికారులు. నేటితో డ్రగ్స్ కేసులో సినీతారల విచారణ ముగిసింది. తన బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్‌లతో హాజరయ్యారు 12 మంది సినీ సెలబ్రిటీలు.
పూరి జగన్నాథ్‌తో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ప్రారంభమయ్యింది. తరుణ్‌తో ఈ విచారణ ముగిసింది. ఆగస్ట్ 31 న పూరి జగన్నాథ్‌ను 10 గంటల పాటు విచారించింది ఈడి. ఈనెల 2న ఛార్మినీ 8 గంటల పాటు విచారించారు అధికారులు. అయితే ఈనెల 6న రకుల్ హాజరు కావాల్సి ఉండగా.. 3వ తేదీనే విచారణకు వెళ్లింది. 6 గంటలపాటు రకుల్‌ను విచారించారు అధికారులు. ఇక 20వ తేదీన హాజరు కావాల్సిన నందు ఈనెల 7న విచారణకు వచ్చారు. అదే రోజు కెల్విన్ , జీశాన్‌ల ఇళ్లలో సోదాలు చేసి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు అధికారులు. 8వ తేదీన రానాను విచారించారు. అయితే రానా, నందు విచారణకు హాజరైన రోజుల్లోనే కెల్విన్, జీశాన్‌లను కలిపి విచారించింది ఈడీ. ఈనెల 9న రవితేజతో పాటు డ్రైవర్ శ్రీనివాస్‌ను.. 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్‌ను ప్రశ్నించారు. 15 న ముమైత్ ఖాన్.. సెప్టెంబర్ 17న తనీష్‌ను 7 గంటల పాటు విచారించారు అధికారులు. అయితే, విచారణకు తమ చార్టెడ్ అకౌంటెంట్‌లను తీసుకొచ్చారు పలువురు తారలు.