Dharmapuri Arvind Demands Kavita To Resign MLC Post: దేశంలో జరుగుతున్న అత్యంత అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం ఉందని.. ఆమ్ ఆద్మీ పార్టీ భ్రష్టు పట్టడంలోనూ ఆయన హస్తముందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించారని, ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అవినీతిలో కవిత పూర్తిగా కూరుకుపోయిందని, సీబీఐ విచారణలో కవిత ముద్దాయిగా తేలడం ఖాయమని అన్నారు. కేసీఆర్ తన పదవిలో కొనసాగడానికి వీలు లేదని, కవిత విషయంలో ఆయన నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఫీనిక్స్ పైన కూడా దాడులు జరుగుతున్నాయని, త్వరలోనే కేటీఆర్ బాగోతం కూడా బయటకు వస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం ఈడీ, సీబీఐలో ఇరుక్కుపోయారని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్యపాత్ర ఉందని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబానికి భారీ మొత్తమే అందిందని ఆయన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించారని.. ఆ హోటల్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్, ఇతర ఎక్సైజ్ అధికారులతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం ఉన్నారన్నారు. అంతేకాదు.. మద్యం మాఫియాను దక్షిణాది నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది కేసీఆర్ కూతురు కవితేనని బీజేపీ మాజీ ఎమ్మెల్యే మజుందర్ సింగ్ సిర్సా కూడా ఆరోపించారు. తనపై వస్తున్న ఈ ఆరోపణలపై కవిత సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. పర్వేష్ వర్మ, మజుందర్ సింగ్‌లపై పరువు నష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ వాగ్వాదం నడుస్తోంది.
