Kondagattu: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు జనసంద్రంగా మారింది. దీక్షకు హనుమాన్ మాలధారులు భారీగా తరలివస్తున్నారు. దీక్షాపరుల రాకతో కొండంతా రామ నామస్మరణతో మారుమోగుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు బందోబస్తును పెంచారు. కొండగట్టులో నేటి వరకు హనుమాన్ జయంతి వేడుకలు జరగనున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. దీక్షకు వచ్చే భక్తుల కోసం 300 మంది అర్చకులను, తలనీలాలు సమర్పించేందుకు 1500 మంది నాయీబ్రాహ్మణులను అధికారులు నియమించారు. 4 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ నాలుగు ఉచిత బస్సులను నడుపుతోంది. భక్తులకు తాగునీరు, కూల్ షెల్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ తాగునీటి సమస్య, పారిశుధ్యం లోపించడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Hanuman Jayanthi: ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రాల నుంచి ప్రత్యక్షప్రసారం
భద్రాచలం శ్రీ సీతారాముల తరపున భద్రాద్రి ప్రధాన అర్చకులు ఈరోజు అంజన్నకు పూజలు, పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ క్రతువుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా యాగశాలలో మూడు రోజుల పాటు లోక కల్యాణార్థం హోమం నిర్వహిస్తారు. జగిత్యాల జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయగా 115 మంది సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు. స్వామివారి ప్రసాదాల విక్రయం కోసం 14 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు టిక్కెట్ల వ్యవహారం, అక్రమ వసూళ్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో కొండగట్టు వద్దకు వచ్చే దీక్షాపరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు తగు చర్యలు చేపట్టారు. దారిలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రధాన రహదారి పొడవునా పలుచోట్ల తడిగుడ్డలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు.
Hanuman Jayanthi: ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రాల నుంచి ప్రత్యక్షప్రసారం