వివిధ ప్రాచీన కళలు కనుమరుగవుతున్నాయి. గతంలో ఏ చిన్న కార్యక్రమం వున్నా డప్పు ద్వారా అందరికీ తెలియచేసేవారు. విద్యార్థుల్లో ఉన్న సామాజిక చైతన్య స్పృహని ,వాళ్లలో ఉన్న కళని పైకి తెచ్చి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మరుగున పడిన డప్పు కళను ఈతరం సమాజానికి పరిచయం చేద్దామని సంగారెడ్డి పట్టణం తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డప్పు సర్టిఫికెట్ కోర్సు ఏర్పాటు చేశారు ప్రిన్సిపాల్ ప్రవీణ. ఈ సర్టిఫికెట్ కోర్స్ తెలుగు యూనివర్సిటీ సిలబస్ ప్రకారమే నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ డప్పు కోర్సు కి స్థానిక ప్రజల నుండి ప్రజాదరణ పొందడంతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్న వారి నుండి విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. డప్పు శిక్షణ సర్టిఫికెట్ కోర్స్ నేర్చుకుంటున్న విద్యార్థులకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. కళాశాల సిబ్బంది విద్యార్థులకు ఎన్‌ఎస్ఎస్ యూనిట్ ద్వారా ఏదైనా నేర్పించాలని ప్రారంభించిన ఈ కోర్స్ స్థానిక ప్రజల మన్ననలు పొంది ముందుకు సాగుతుంది. మరుగున పడిన డబ్బు కళను పైకి తెచ్చి కుల మతాలతో సంబంధం లేకుండా కొత్త తరానికి పరిచయం చేయాలని ప్రారంభించారు అందే మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్.
కిషన్ అనే విద్యార్థి డప్పు నేర్చుకోవడం వల్ల తన ప్రదర్శన ద్వారా రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొని సంగారెడ్డి తార కళాశాలకు, తెలంగాణకు మంచి పేరు తీసుకు రావడం జరిగింది. ప్రిన్సిపాల్ ప్రవీణ, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జగదీష్ సహకారంతో డప్పును 52 గంటల సర్టిఫికెట్ కోర్సు గా ప్రవేశ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా వంద మంది విద్యార్థినీ, విద్యార్థులు నేర్చుకొని స్థానికంగా ప్రజలనుండి ప్రజాదరణ పొంది సభలు సమావేశల్లో డప్పు ప్రదర్శన నిర్వహిస్తున్నారు విద్యార్దినీ, విద్యార్దులు.
సంగారెడ్డిలోని తార ప్రభుత్వ కళాశాలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ ఆధ్వర్యంలో అంతరించిపోతున్న, జానపద కళలకు ప్రాణం పోస్తున్నారు. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రోత్సాహంతో తార డిగ్రీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు, ఎన్ ఎస్ ఎస్ యూనిట్ విద్యార్థులకు డప్పు నేర్పిస్తున్నారు.