NTV Telugu Site icon

CM Revanth Redddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. సీఎం రేవంత్ ప్రసంగం హైలెట్స్..

Phared Ground Cm Revanth Reddy

Phared Ground Cm Revanth Reddy

CM Revanth’s Speech on Telangana State’s Inauguration Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నానని తెలిపారు. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి శ్రీ మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ లకు తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ… అందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ… అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదన్నారు. “ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం… ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం” అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలన్నారు.

డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుండి… ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. ప్రగతి భవన్ ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా పేరు మార్చి… ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. అక్కడ ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

ప్రజల సమస్య నేరుగా విని, పరిష్కరిస్తున్నాం. సచివాలయంలోకి ఈ రోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం. ఇందిరాపార్కులో ధర్నాచౌక్ కు అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛను ఇచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వ జ్ఞానులం అన్న భ్రమలు లేవు. అందరి సలహాలను, సూచనలను స్వీకరించి, చర్చించి ముందుకు వెళుతున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ ప్రాధాన్యత.

జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. అంతటితో మనం లక్ష్యాన్ని చేరినట్టు కాదు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది. దశాబ్ద కాలం అన్నది ఒక మైలురాయి. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నాం అన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం. నేను రాజకీయ విమర్శల జోలికి పోను కానీ, చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్ కు పునాదులు వేసుకోగలం. తప్పొప్పులను గుర్తించి, దిద్దుబాటు చేసుకోవడం విజ్ఞుల లక్షణం.

పదేండ్ల పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైంది. భౌతిక విధ్వసం మాత్రమే కాదు. తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛ పై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడిపండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సినరాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కర్లేదు. ఇది గతం…ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజా ప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది.

తెలంగాణ ప్రదాత, మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియాగాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాం. ఏ హెూదాలో సోనియాగాంధీ గారి ని ఆహ్వానించారని అడుగుతున్నారు. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హెూదా కావాలా?! తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా?! ఏ హెదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మనం జాతిపితగా గుర్తించుకున్నాం?! తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియాగాంధీని ఈ సమాజం తల్లిగా గుర్తించి, గౌరవిస్తుంది. ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాలకు అతీతం. దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో… అమరుల ఆశయాలు, ప్రజల కలలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 1. సాంస్కృతిక పునరుజ్జీవనం. 2. ఆర్థిక పునరుజ్జీవనం. ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి కీలకాంశాలు. ఆ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వం. ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. బోనం నుండి బతుకమ్మ వరకు… సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి, మన చరిత్ర గొప్పవి. సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు… భద్రాద్రి రాముడు నుండి కొమురం భీం వరకు, అమరుల త్యాగాలు, హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ సంస్కృతికి, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి. తెలంగాణ వచ్చి పదేండ్లైన ఇప్పటికీ మనకు రాష్ట్ర గీతం లేదు.

ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన… “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం…” గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆ నాడు ఆశించాం. సహజ కవి అందెశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన “జయ జయహే తెలంగాణ…” గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నాం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తొలి అడుగు. చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దంపడుతుంది. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. వివిధ వర్గాల నుండి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం. అదే విధంగా…

ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు, సంస్థల సంక్షిప్త పేర్లు, వాహన రిజిస్ట్రేషన్ లో రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలుగా TG ఉండాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యమ సమయంలో TG నే రాష్ట్ర సంక్షిప్త అక్షరాలుగా ప్రజలు నిర్ధారించుకున్నారు. యువత తమ గుండెలపై TG అక్షరాలను పచ్చబొట్లుగా పొడిపించుకున్నారు. వారి ఆకాంక్షల మేరకు TS స్థానంలో TG ని పునరుద్ధరిస్తు ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ… అంటే, జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి అని అర్థం. తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే… మన కన్నతల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళ రూపమే… తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి… కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి. త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపం సిద్ధం అవుతుంది. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగం. ఈ నిర్ణయాలు ఎవరికీ వ్యతిరేకం కాదు. ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే.

ఆర్థిక పునరుజ్జీవనం :

రాష్ట్ర సంపద పెంచి, పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉంది. మేం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ ఉంది. శాసనసభలో శ్వేత పత్రం పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నాం..

గ్రీన్ తెలంగాణ 2050 స్వల్పకాలిక ఆలోచనలు కాదు… దీర్ఘ కాలిక ప్రణాళికలతో భవిష్యత్ కు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు “గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్” తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి… ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం.

మూసీ సుందరీకరణ…

మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా తీర్చిదిద్దబోతున్నాం. దీని కోసం ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఈ పథకం మరోస్థాయికి తీసుకువెళ్లుతుందనడంలో సందేహం లేదు. పర్యాటకం, ఆర్థికం, పర్యావరణం ఈ మూడు కోణాలు ఇందులో ఉన్నాయి. ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలలో సాగునీటి వనరుగా కూడా మూసీ ఉపయోగపడుతుంది. ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికను ప్రకటించాం. రీజినల్ రింగ్ రోడ్డు త్వరిత గతిన పూర్తికి ప్రయత్నిస్తాం. తక్కువ ఖర్చుతో, ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకుంటాం.

డ్రగ్స్ పై ఉక్కు పాదం…

తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేం సంకల్పం తీసుకున్నాం. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. టీ న్యాబ్ కు పూర్తి సహకారం, స్వేచ్ఛ ఇస్తున్నాం. అవసరమైన నిధులు ఇస్తున్నాం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్యే లేదు. ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా పట్టుదలతో ఉన్నాను. ఇది మన యువత భవిష్యత్ కు సంబంధించిన అంశం. అందుకే ఉక్కుపాదంతో అణచివేయాలని సంకల్పించాం. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు ప్రభుత్వ పరంగానే కాదు… వ్యక్తిగతంగా నేను ప్రాధాన్యత ఇస్తున్నాను.

ఇది ప్రజా పాలన…
పాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది మా ఆలోచన. ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా 2023 డిసెంబర్ 28 నుండి 2024 జనవరి 6 వరకు అభయ హస్తం గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాం. మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, చేయూత, రైతు భరోసా పథకాల కోసం ఒక కోటీ 28 లక్షల మంది ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. డూప్లికేట్ దరఖాస్తులు మినహాయించగా కోటి తొమ్మది వేల దరఖాస్తులు మిగిలాయి. ఈ దరఖాస్తులు కంప్యూటరీకరించి, పరిష్కరించే ప్రక్రియ నడుస్తోంది.

48 గంటల్లో రెండు గ్యారెంటీలు…

అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాం.రాజీవ్ ఆరోగ్య శ్రీ అన్నది కాంగ్రెస్ పేటెంట్. ఈ పథకం ద్వారా తొలి సారి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ పథకం లక్షలాది మంది ప్రాణాలు కాపాడింది. ఈ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడానికి ఐదు లక్షలు ఉన్న పరిధిని డిసెంబర్ 9, 2023 నుండి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. యువత ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. 70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ నెల తొమ్మిదిన ప్రాథమిక పరీక్ష జరగబోతోంది. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చాం. వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం. ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేస్తాం.

ఇందిరమ్మ ఇళ్లు…

రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. ఈ ఒక్క ఏడాడే 22,500 కోట్ల రూపాయలు వెచ్చింది… పేదల కోసం 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వబోతున్నాం. ఇంటి స్థలం లేని వారికి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నాం.

విద్యారంగ ప్రక్షాళన
తెలంగాణను ఎడ్యూకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించాం. ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిస్సా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసింది. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,825 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లు నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. దీని కోసం 1135 కోట్ల రూపాయలు కేటాయించాం. రాష్ట్రంలోని 50 ఐటీఐలలో సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నాం.

రైతును రాజును చేయడం మా సంకల్పం

రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం ఇది. గతంలో రైతుకు ఉచిత విద్యుత్, రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఆ ట్రాక్ రికార్డును ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోంది. రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశాం. ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇచ్చాం. ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలు తెరిచాం. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొంటున్నాం. తరుగు విషయంలో రైతు నష్టపోకుండా చూస్తున్నాం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాం. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. ధరణి పోర్టల్ పై స్పెషల్ డ్రైవ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నాం.

విద్యుత్ సరఫరాలో రికార్డు బ్రేక్

రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి 6 న అత్యధికంగా 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. రికార్డు సృష్టించాం. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. దావోస్ పర్యటనలో భాగంగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒకరికార్డు. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యచరణ మొదలుపెట్టాం. తద్వారా మన యువత ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. ఆడబిడ్డల ప్రభుత్వం ఇది…మహాలక్ష్మీ పథకం ద్వారా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది మా సంకల్పం. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. విద్యార్థుల యూనిఫార్మ్స్ కుట్టే ఆర్డర్ మహిళా సంఘాలకే అప్పగించాం. గ్యాస్ బండ ను కేవలం 500 రూపాయలకే ఇచ్చే పథకాన్ని ప్రారంభించాం. తెలంగాణ ముందు పలు సవాళ్లు కూడా ఉన్నాయి.

కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. పదేండ్లైనా నీటి పంపకాలు జరగలేదు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకుని, సాగునీటి ప్రణాళికలు సమర్ధవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజా ప్రభుత్వ ఆలోచన. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్ తో ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం.తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. తెలంగాణ విజయ పతాక దేశ విదేశాలలో సగర్వంగా ఎగరాలి. “పల్లె కన్నీరు పెడుతోందో…” అని ఒకనాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో, పాడి పంటలతో, రైతుల మొఖాలలో చిరునవ్వులతో వెలగాలి.

ఒకనాడు పొట్ట చేత పట్టి పట్నంకు వచ్చిన యువత… రేపటి నాడు ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. మనకు శక్తి ఉంది, సత్తువుంది… తెలివి ఉంది, తెగింపు ఉంది, త్యాగాల చరిత్ర ఉంది. ఏం తక్కువ తెలంగాణకు. హైదరాబాద్ మన బ్రాండ్. ప్రపంచ నెంబర్ వన్ బ్రాండ్ గా హైదరాబాద్ ఎదగాలి. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్ గా మార్చాలన్న తపన ఉంది. దీనికి నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు… రాజకీయ, పరిపాలన, పత్రికా, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకరం కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరు, ప్రతి క్షణం ఆలోచన చేయాలని… ప్రజా ప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటూ…అందరికీ మరొక్కసారి తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జై తెలంగాణ… జై హింద్… అంటూ సమావేశం ముగించారు సీఎం రేవంత్ రెడ్డి.

Show comments