Site icon NTV Telugu

CM KCR: ‘సింహ లగ్న’ ముహూర్తంలో రాష్ట్ర పరిపాలనా భవనాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

New Secretariat Cm Kcr

New Secretariat Cm Kcr

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు మధ్యాహ్నం 1:20 గంటలకు సింహ లగ్న ముహూర్తంలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా భవనాన్ని ప్రారంభించనున్నారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ తెరవనుండగా, అదే సమయంలో మంత్రులందరూ తమ తమ కార్యాలయాలను తెరవనున్నారు. అధికారులు కూడా ఆయా శాఖల కార్యాలయాల్లో కూర్చోనున్నారు. ప్రధాన రెండు గోపురాలపై 18 అడుగుల ఎత్తున్న నాలుగు సింహాల జాతీయ చిహ్నాలు ఏర్పాటు చేయబడ్డాయి. 5 అడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువు ఉండే ఈ చిహ్నాలు ఢిల్లీలో తయారు చేయబడ్డాయి.

కొత్త సచివాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నేతృత్వంలో నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖల ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లతో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి పలు లోపాలను గుర్తించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు నివేదిక ఇచ్చింది. దీంతో 2019 జూన్ 27న నూతన సచివాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు డాక్టర్‌ ఆస్కార్‌, పొన్నీ కాన్సెసావో డిజైనర్లుగా వ్యవహరించారు. ప్రస్తుత మోడల్‌లోనే కొత్త సచివాలయ నిర్మాణానికి కేసీఆర్ ఆమోదం తెలిపారు. తర్వాత షాపూర్ జీ పల్లోంజీ అండ్ కంపెనీ సచివాలయాన్ని నిర్మించే కాంట్రాక్టును పొందింది.

నిజామాబాద్‌లోని కాకతీయుల కాలం నాటి నీలకంఠేశ్వరస్వామి దేవాలయం, వనపర్తి సంస్థానానికి చెందిన రాజప్రసాదుల గోపురాలు, గుజరాత్‌లోని సారంగాపూర్‌లోని హనుమాన్ ఆలయ శైలి ఆధారంగా సచివాలయ గోపురాలను నిర్మించారు. బయట ఆకర్షణీయంగా కనిపించే టపాదాలన్నీ ఎర్ర ఇసుకరాయితో, మధ్యలో ఉన్న శిఖరం లాంటి బురుజు రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ నుంచి తెప్పించిన ఇసుకరాయితో నిర్మించారు. కొత్త సచివాలయానికి తూర్పున లుంబినీవనం, అమరజ్యోతి, పశ్చిమాన మింట్ కాంపౌండ్, ఉత్తరాన అంబేద్కర్ విగ్రహం, దక్షిణాన రవీంద్రభారతికి వెళ్లే రహదారులు ఉన్నాయి.
New secretariat: సెక్రటేరియట్ కట్టడానికి వాడిన మెటీరియల్.. అంతస్తుల వారీగా వివరాలు

Exit mobile version