NTV Telugu Site icon

CM KCR: పంటల తెలంగాణ కావాలా.. మంటల రాష్ట్రం కావాలా?

Kcr Speech Kongara Kolan

Kcr Speech Kongara Kolan

CM KCR Speech In Kondara Kolan Public Meeting: కొంగర కలాన్‌లో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించిన తర్వాత.. సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. జిల్లా ఏర్పాటు చేసుకుని, నూతన సమీకృత సముదాయం నిర్మించుకున్నామన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పడితే భూముల ధరలు తగ్గిపోతాయని తప్పుడు ప్రచారం చేశారన్నారు. నాడు కరెంటు, మంచి నీళ్లు ఇవ్వని.. పేదల సంక్షేమం చేయని వాళ్లు అలాంటి ప్రచారాలు చేశారని చెప్పారు. పట్టుదలతో 14-15 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. నిద్రలో, ఏమరపాటులో ఉండి ఉంటే.. నేడు బాధపడుతూ ఉండేవాళ్లమని తెలిపారు. స్వతంత్ర హైదరాబాద్ స్టేట్‌గా ఉన్నామని.. ఆనాటి నాయకత్వం ఏమరుపాటుగా, నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో భాగమయ్యాం.. అప్పుడు మనం పడిన బాధలేంటో అందరికీ తెలుసని కేసీఆర్ పేర్కొన్నారు.

మళ్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి బయటపడేందుకు 69 ఉద్యమాలు చేశామని.. ఆ ఉద్యమాల్లో 400 మంది బలి అయ్యారని కేసీఆర్ చెప్పారు. ఈమధ్య జరిగిన ఉద్యమంలోనూ అనేకమంది చనిపోయారన్నారు. అహింసాయుతంగా పోరాడినా.. అనేక బాధలు ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల 58 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి వచ్చిందని.. మొన్ననే ఆంధ్రప్రదేశ్ నుంచి బయటపడ్డామన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో ఏం జరుగుతోందో అందరూ కళ్లారా చూస్తూనే ఉన్నారన్నారు. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. రైతు బందు, రైతు భీమా సదుపాయాలు ఎక్కడా లేవని చెప్పారు. తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. అందుకోసం 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్ని కేంద్రాలున్నాయి. వారం రోజుల్లో ధాన్యం డబ్బులు బ్యాంకుల్లో జమ అవుతున్నాయి.

తెలంగాణ వచ్చాక రైతులు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని.. వ్యవసాయనికి 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్‌తో పాటు ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా నీరు అందిస్తున్నామని సీఎం చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ని సదుపాయాలు ఉంటాయా? అని కలలు కన్నామా అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతుల కష్టాలు తొలగిపోయాయన్నారు. అనేక రంగాల్లోనూ సంక్షేమం చేసుకుంటూ పోతున్నామన్నారు. ఈ సదుపాయాలు కావాలా వద్దా? అని నిలదీశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ఉన్నాను కాబట్టి.. మీ బిడ్డగా రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా కాపాడుకుంటానని కేసీఆర్ వాగ్దానం చేశారు. పంటలు పండే తెలంగాణ కావాలా… మత పిచ్చితో మంటల మండే తెలంగాణ కావాలా? అని ప్రజల్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రశ్నించారు. మంటలు మండే తెలంగాణ ఉంటే.. ఎన్నో కష్టాలు, బాధలు పడాల్సి వస్తుందన్నారు.

కేవలం రాష్ట్రం మాత్రమే కాదు.. కేంద్రం కూడా బాగుండాలని కేసీఆర్ అన్నారు. దేశ ఆదాయం పెరిగితే.. అందులో భాగమైన మనం కూడా బాగుపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క మంచిపని అయినా చేసిందా? దళితులకు, గిరిజనులకు, రైతులకు, మహిళలకు ఒక్క పథకం ప్రవేశపెట్టలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు కడిగి పారేశారు. తెలంగాణ రాకముందు కరెంటు ఉండేది కాదు.. తిప్పలు పడి తెలంగాణ తెచ్చుకున్నాక ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. కేంద్రంలోని ప్రధాని, ఇతర మంత్రులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను సీఎం అయిన సమయంలోనే మోదీ ప్రధాని అయ్యారని.. మరి,
తెలంగాణలో ఇస్తున్న కరెంట్ దేశమంతటా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 70 టీఎంసీల నీళ్లు నదుల్లో పారుతుంటే, మంచి నీళ్లు ఇచ్చే స్థోమత లేదా? అని ప్రధాని మోదీని కేసీఆర్ నిలదీశారు.

హైదరాబాద్‌లో 24 గంటల కరెంటు ఉంటోందని, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కరెంట్ ఉండట్లేదని.. అలాంటి ప్రధానమంత్రేనా మనకు కావాల్సింది? అని కేసీఆర్ అడిగారు. ప్రజలు అవకాశం ఇస్తే, ఆ టర్మ్‌లో పని చేయాలని.. లేకపోతే ప్రతిపక్షంలో కూర్చోవాలన్నారు. కానీ.. కేంద్రంలో ఉన్న ప్రధాని కుట్రలు పన్ని, దేశంలోని 9 రాష్టాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చారన్నారు. తమిళనాడు, బెంగాల్, ఢిల్లీలో ప్రభుత్వాలు కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని.. ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా.. ఇది రాజకీయమా? అరాచకత్వమా? దీనికి సమాధానం కావాలని డిమాండ్ చేశారు. దీన్ని భరించుకుంటూ పోతే, వాళ్లని విచ్చలవిడిగా వదిలేస్తే.. మత పిచ్చి మంటలు వస్తాయన్నారు.

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడే బెంగళూరులో.. ఈ ఏడాదిలో తక్కువ ఉద్యోగ కల్పన జరిగిందని, హైదరాబాద్‌లో ఎక్కువ ఉద్యోగాలు లభించాయని కేసీఆర్ అన్నారు. హిజాబ్, హలాల్ అంటూ మతపరమైన ఆందోళనల్ని తెరలేపడం వల్లే.. బెంగళూరులో ఉద్యోగాలు తగ్గిపోయాయని, అక్కడ భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అలాంటి ఆందోళనలు తెలంగాణలోనూ ఏర్పడితే.. ఇక్కడికొచ్చే పరిశ్రమలు రాకుండా పోతాయన్నారు. రంగారెడ్డి జిల్లా.. తెలంగాణకు బంగారు కొండ అని అన్నారు. ఆ జిల్లాలో భూముల విలువలు కోట్లలో పలుకుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితి ఉండాలంటే.. పనికి మాలిన వాళ్ళు నీచ రాజకీయాల కోసం పన్నుతున్న కుట్రల్ని తిప్పి కొట్టాలన్నారు. ఓట్ల కోసం భారత సొసైటీని గోస పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఎందుకు ఆగం ఆగం అవుతున్నావంటూ ప్రధాని మోదీని ప్రశ్నించిన కేసీఆర్.. ఉన్న ప్రధాని పదవి చాలదా? పీఎం కంటే పెద్ద పదవి లేదు కదా? అని అన్నారు. దుర్మార్గులు, చిల్లర గాళ్ళు.. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని.. వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్టాన్ని ఆగం కానివ్వనని చెప్పారు. ఐక్యత దెబ్బతిన్న నాడు బ్రతుకులు ఆగం ఆవుతాయని.. మత పిచ్చి గాళ్లను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. లేకపోతే.. వంద సంవత్సరాల వెనక్కు పోయే ప్రమాదం ఉందన్నారు. ఒకరినొకరు అసహ్యించుకుంటూపోతే బ్రతకలేమని.. ఆకుపచ్చ తెలంగాణ ముందుకు వెళ్లాలన్నారు. కేంద్రం నుంచి వీళ్ళను సాగనంపితే, మనం బాగుపడుతామని.. ఉద్విగ్న భవిష్యత్తు కోసం మనం పోరాటం చేయాలని.. జతీయ రాజకీయాల్లో ఉజ్వల పాత్ర పోషిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.