CM KCR Conveys Bathukamma Greetings To Telangana People: ఆదివారం నుంచి తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన ‘బతుకమ్మ’ ఉత్సవాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా.. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక సంబురం గొప్పగా వెల్లివిరుస్తుందని తెలిపారు. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందని.. తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్ద పీట వేసిందని చెప్పారు. దాదాపు 350 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటి చీరలను కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా అందిస్తూ గౌరవించుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల జీవనంలో భాగమైపోయిన ‘బతుకమ్మ’.. ఖండాంతరాలకు విస్తరించి, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందన్నారు. బతుకమ్మ పండుగను జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్న సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో దీవించాలని బతుకమ్మను ప్రార్థించారు.
కాగా.. తెలంగాణలోని పల్లెల్లో బతుకమ్మ సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వహిస్తారు. పెళ్లైన ఆడవాళ్లు పుట్టింటికి వచ్చి.. బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మను పేర్చేందుకు మగవాళ్లు పొలాలకు పోయి తంగేడు, మందారం, బంతి, సీతజడలు, తామరపూలతో పాటు ఇంకా ఎన్నో రకాల పూలను తీసుకొస్తే.. వాటితో ఆడవాళ్లు బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మకు ఒక్కోరోజు ఒక్కో నైవేద్యం పెడతారు. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, బెల్లం, పాలతో చేసినవి సమర్పిస్తారు. అంతేకాదు.. బతుకమ్మను ఒక్కోరోజు ఒక్కో పేరుతో పిలుస్తారు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బియ్యం బతుకమ్మ, ఆరో రోజున అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదోరోజు బతుకమ్మ అని పిలుచుకుంటారు.
