Site icon NTV Telugu

Mohammad Azharuddin: అజారుద్దీన్‌పై ఫిర్యాదు.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్

Case On Azharuddin

Case On Azharuddin

Case Filed On Mohammad Azharuddin And HCA Officials In Human Rights Commission: HCA అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌పై రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌లో ఫిర్యాదు అందింది. టికెట్ల విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని యుగంధర్ గౌడ్ అనే వ్యక్తి హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించాడు. అజారుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, వెంటనే ఆయన్ను పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాడు. క్రీడాభిమానులపై లాఠీఛార్జికి కారకుడైన అజారుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏ నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు. జింఖాన గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం.. హెచ్‌సీఏతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మ్యాచ్ టికెట్ల విషయంలో హెచ్‌సీఏ పూర్తిగా విఫలమైందని.. సరైన ఏర్పాట్లు చేయలేదని ఆయన ఆగ్రహించాడు. క్రీడాభిమానుల నుంచి లక్షల, కోట్ల రూపాయలు దండుకొన్నారని ఆరోపణలు చేశాడు. హెచ్‌సీఏ అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా క్షతగాత్రులను పరామర్శించకపోవడం బాధాకరమన్నాడు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశాడు.

కాగా.. మూడు సంవత్సరాల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో, టికెట్ల కోసం జింఖాన వద్ద క్రీడాభిమానుల వేలాది సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్ముతున్నట్టు హెచ్‌సీఏ ప్రకటించింది. కానీ, టికెట్లు బుక్ అవ్వలేదని భారీఎత్తున ఫిర్యాదులు అందాయి. ఇంతలోనే జింఖాన వద్ద టికెట్లు అమ్ముతున్నారన్న ప్రచారం జరగడంతో, బుధవారం జింఖాన గ్రౌండ్స్ వద్ద ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. అప్పుడు జింఖాన గేట్లు మూసి ఉండటం, అధికారులెవ్వరూ లేకపోవడంతో.. ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. గేట్ ఎక్కి లోపలికి వెళ్లి, నిరసన వ్యక్తం చేశాడు. అప్పుడు హెచ్‌ఆర్‌సీ అధికారులు దిగొచ్చి, గురువారం టికెట్లు అమ్ముతామని ప్రకటించడంతో ఫ్యాన్స్ శాంతించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా టికెట్ల అమ్మకాలు మొదలవుతాయని తెలపడంతో, రాత్రి నుంచి ఫ్యాన్స్ జింఖాన గ్రౌండ్స్ వద్దకు చేరుకోవడం స్టార్ట్ చేశారు. ఇక టికెట్ల అమ్మకం మొదలయ్యాక తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి. ఈ తొక్కిసలాటలో కొందరు స్పృహతప్పి పడిపోయారు. అటు పోలీసులు సైతం లాఠీచార్జి చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Exit mobile version