By Elections Campaign In Munugode Over: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం చివరి రోజు కావడంతో.. ఓటర్లను తమవైపుకు తిప్పుకోవడం కోసం ప్రధాన పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం చేశాయి. కొందరు ప్రధాన నేతలు కూడా రంగంలోకి దిగి.. రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. పోలింగ్ జరిగ 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలి. దీంతో.. ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన వారందరూ మునుగోడు నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లిపోయారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత ఈసీ కోడ్‌ని ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు రాజకీయ పార్టీలన్నీ తిరిగి యధావిధిగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
కాగా.. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఈసీ చేసిందని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పాల్వాయి స్రవంతి, రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్ని మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, భారీఎత్తున ప్రచారం చేశాయి. దీంతో.. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి నెలకొంది. నవంబర్ 6వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
మరోవైపు.. ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఎన్నికల అధికారి వికాస్ రాజ్ విధి విధానాల్ని విడుదల చేశారు. నాన్-లోకల్ వాళ్ళు మునుగోడులో ఎవరున్నా.. చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు, ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లున్నారని.. 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త డిజైన్‌తో కూడిన ఓటర్ ఐడి ఇచ్చామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తంగా యాబై టీంలు ఉన్నాయని చెప్పారు.