NTV Telugu Site icon

Green India Challenge: కేటీఆర్ బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

Ktr Birthday Special Green

Ktr Birthday Special Green

Green India Challenge: తెలంగాణ ఐకాన్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పంచవటి కాలనీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోబ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ పాల్గొని మొక్కలు నాటారు. కోవిడ్ వారియర్స్ తో పాటు ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘Trees give peace to the souls of men’ అని చెప్పారు. ఈ కార్యక్రమం చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇంగ్లీషు సాహిత్యంలో చెట్లు వాటి వేర్లు మానవ ఎదుగుదలను, మనిషి తన మూలాలను మరిచిపోవద్దనే మూల సూత్రాన్ని వివరిస్తుంటాయని.. అందుకే మనిషి తన ఎదుగుదలను మొక్కలతో పోల్చుకోవాలని ఆండ్రూ ఫ్లెమింగ్ పిలుపునిచ్చారు.

తాను ఐదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చినప్పటి వాతావరణానికి ఇప్పటి హైదరాబాద్‌కు చాలా మార్పు వచ్చిందని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసినా తనకు పచ్చదనం పరుచుకున్నట్లు కనిపిస్తోందని ప్రశంసించారు. అంతేకాదు.. కాలాలకు అతీతంగా నిత్యం మొక్కలు నాటించే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం అద్భుతమన్నారు. మనిషి తలచుకుంటే ఎంతటి కార్యాన్ని అయినా సాధించవచ్చని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిరూపించారన్నారు. ఆయన ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక్క ఇండియాకు మాత్రమే పరిమితం కాకుడదని.. మానవ నాగరికత నడుస్తున్న ప్రతీ చోట ఇది అవసరమేనని ఆయన తెలిపారు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని తీసుకొని దిగ్విజయంగా కొనసాగిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆండ్రూ ఫ్లెమింగ్ పేర్కొన్నారు.

అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పిలవగానే వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న ఆండ్రూ ఫ్లెమింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి గురించి వారి చెప్పిన మాటలు చాలా విలువైనవి అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కొవిడ్ వారియర్‌కు ఎంపీ సంతోష్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ రాఘవ పాల్గొన్నారు.