BJP MP Laxman Again Fires On CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన కోటా శ్రీనివాసరావును మించిన నటుడు అంటూ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక.. తెలంగాణ ఆత్మగౌరవానికి, కల్వకుంట్ల కుటుంబానికి మధ్యేనని అన్నారు. ఒక్క ఎర్రవెల్లిలో మాత్రమే 100 ఇళ్లు నిర్మించి.. ఎనిమిదేళ్లుగా అవే చూపిస్తున్నారని టీఆర్ఎస్‌పై మండిపడ్డారు. మిగిలిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారని ఆరోపించారు. కేవలం మునుగోడు ఉప ఎన్నిక కోసమే.. ఎస్టీల రిజర్వేషన్ పెంచారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ఇంత ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్నారని.. ఇప్పటివరకూ రుణమాఫీ చేయలేదని, ఎప్పుడు చేస్తారో చెప్పాలని అడిగారు.
అంతకుముందు.. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే, తాను మునుగోడును దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు లక్ష్మణ్ కౌటర్ ఇచ్చారు. కెసిఆర్, కేటీఆర్ దత్తత తీసుకుంటేనే అభివృద్ధి జరుగుతుందా? అని ప్రశ్నించారు. మరి టీఆర్ఎస్‌లో ఉన్న ఇతర ఎమ్మెల్యేలంతా దద్దమ్మలా? అని నిలదీశారు. దుబ్బాక, హుజురాబాద్‌లో ప్రజా తీర్పుతో టీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న విషయం తేలిందని అన్నారు. ఒకప్పుడు ఉద్యమానికి ఉప ఎన్నికలు ఊపిరి పోశాయని, ఇప్పుడు ఆ ఎన్నికల్ని చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారన్నారు. కుల, గ్రామాల వారీగా మద్యం, డబ్బులు పంచుతూ.. టీఆర్ఎస్ ప్రజా అభిప్రాయాన్ని కూడగట్టుకొనే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
