NTV Telugu Site icon

MLA Raja Singh: మరో వీడియో రిలీజ్.. నేను అన్నింటికీ సిద్ధం

Raja Singh New Video

Raja Singh New Video

BJP MLA Raja Singh Released New Video: ఇటీవల ఒక కామెడీ షో పేరుతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన వీడియో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే! తమ మనోభావాలు దెబ్బతీసేలా ఆ వీడియో ఉందని ముస్లిం వర్గీయులు తీవ్ర ఆందోళనలు చేపట్టడంతో, బీజేపీ హైకమాండ్ ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన్ను అరెస్ట్ చేయడం, వ్యవహారం కోర్టు దాకా వెళ్లడం, బెయిల్ మంజూర్ కావడం.. అన్నీ జరిగిపోయాయి. హైదరాబాద్ పాతబస్తీలో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ మరో వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన మహమ్మద్ ప్రవక్తపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, తాము పూజించే ‘రాముడు-సీత’పై కామెంట్స్ చేసిన వ్యక్తి గురించే ప్రస్తావించానని వివరణ ఇచ్చారు.

‘‘మా రాముడు, సీతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మునవ్వర్ ఫారీఖీ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించొద్దని మేము చాలా రోజుల నుంచి చేతులెత్తి మరీ విజ్ఞప్తి చేశాం. కానీ.. సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ఇగోకి పోయి అతని ప్రోగ్రాంని భారీ బందోబస్తుతో చేయించారు. నలుగురు ఐపీఎస్ అధికారులు, వందలమంది పోలీసులు దింపి.. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. రాజాసింగ్ ఏం చేస్తాడో చూసుకుందాం అంతా పంతంతో ఆ ప్రోగ్రామ్ చేయించారు. ఎందుకు చేయించారంటే, ఆయనకు హిందువుల ఓట్లు అవసరం లేదు. కేవలం ముస్లిం ఓట్లే కావాలి. రాజకీయాల్లో ఉన్న తర్వాత హిందువులు, ముస్లిములు, సిక్కులంటూ.. అందరి ఓట్లు కోరుకోవడంలో తప్పు లేదు. కానీ.. మేము అభ్యంతరం తెలిపింది ఒక్క వ్యక్తి మీదే! రాముడు, సీతపై కామెంట్ చేసిన వాడ్ని తీసుకురావద్దని అన్నాం. మన తెలుగువారే చాలామంది ఉన్నారు. వాళ్లతో షో చేయించమంటే, అందుకు భిన్నంగా మునవ్వర్ ఫారుఖీని తీసుకొచ్చారు’’ అంటూ తెలిపారు.

అంతేకాదు.. ప్రతిఒక్కరూ దేవుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, కానీ మీరు (కేటీఆర్‌ని ఉద్దేశించి) మనసు సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, ఎందుకంటే మీరు దేవుడ్ని నమ్మరని, మీరు నాస్తికులంటూ రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడ్ని పిలిపించి, దేవుడ్ని నమ్మే మమ్మల్ని అవమానిస్తారా? అంటూ ఫైరయ్యారు. తాను కూడా షో చేస్తానని వార్నింగ్ చేస్తానని, కానీ వినకుండా ఫారుఖీతో షో చేయించడంతో తాను షో చేయాల్సి వచ్చిందన్నారు. అందులో తాను మహమ్మద్ ప్రవక్తిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేవలం ఒక వ్యక్తి చరిత్రనే ప్రస్తావించానన్నారు. కానీ, మైనార్టీ వాళ్లు దాన్ని తమ స్టోరీగా తీసుకొని, మహ్మద్ ప్రవక్తపై కామెంట్స్ చేశానని అనుకొని, తనపై అనవసరమైన కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహ్మద్ ప్రవక్తపై కామెంట్స్ చేశారని మీరనుకుంటే, అదీ మీ తప్పని.. తన తప్పు కాదని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై తనకు భయం లేదని, ఏం జరుగుతుందో చూసుకోవడానికి తాను సిద్ధమని తేల్చి చెప్పారు.

గతంలో అక్బరుద్దీన్ రాముడు, సీత, సరస్వతి అంటూ దారుణ వ్యాఖ్యలు చేశారని.. అప్పుడు అతనిపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తన సభ్యత్వాన్ని కూడా తీసేస్తారంటున్నారన్నారు. తెలంగాణలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులకు టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలేనని.. తాను కోర్టు ఆదేశాలు పాటించే వ్యక్తినని అన్నారు. విధ్వంసం సృష్టిస్తున్న వారిని పోలీసులు విడిపిస్తున్నారని, మంచి చేసేవాళ్లని అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. షో ఏర్పాటు చేసిన కేటీఆర్‌ను తొలుత అరెస్ట్ చేయాలని, అలాగే కమ్యునల్ వయోలెన్స్ చేయిస్తున్న అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేయాలని, తనని కాదని చెప్పారు. రాముడ్ని తిట్టిన వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రమే తాను నిలబడ్డానని, ఎలాంటి అవాంతరాల్ని ఎదుర్కోవడానికైనా తాను సిద్ధమని, హిందూ ధర్మం కోసం నా ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధం రాజాసింగ్ తాజా వీడియోలో వెల్లడించారు.