Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని మృతి చెందిన ఘటన మరవకముందే మరో విద్యార్థిని లిఖిత మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. బూర లిఖిత ఆర్జీయూకేటీ బాసరలో పియుసి ప్రథమ సంవత్సరం చదువుకుంటుంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో లిఖిత వసతి గృహం 4 వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందికి జారి పడింది. దీంతో లిఖిత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే వున్న వారు కొందరు సంస్థ యాజమాన్యానికి తెలుపగా హుటా హుటిన వచ్చిన అధికారులు లిఖితను క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రధమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం భైంసా ఏరియా హాస్పిటల్ కి తరలించగా.. అనంతరం అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతి చెందిన విద్యార్థిని స్వస్థలం సిద్ది పేట జిల్లా గజ్వెల్ గా తెలిపారు. అయితే లిఖిత ప్రమాదవశాత్తు జారి పడిందా? లేక ఆత్మహత్యా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లిఖిత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Read also: Adipurush 1st Day Collections: ‘ఆదిపురుష్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. క్రేజ్ మాములుగా లేదుగా!
రెండు రోజుల క్రితం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన వడ్ల దీపిక వార్షిక పరీక్షలు రాసింది. బాత్‌రూమ్‌కి వెళ్లిన తర్వాత దీపిక ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి బాత్ రూం తలుపులు తీసి చూడగా.. దీపిక చున్నీతో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని క్యాంపస్ హెల్త్ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. భైంసా ఏరియా ఆసుపత్రి వైద్యులు దీపిక మృతిని ధృవీకరించారు. దీపిక మృతి పట్ల ఆర్జీయూకేటీ బాసర అధికారులు, సిబ్బంది తదితరులు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.