NTV Telugu Site icon

Rangoli: పాతబస్తీలో విషాదం.. ప్రాణం తీసిన ‘ముగ్గు’ వివాదం

Rangoli

Rangoli

Rangoli: వాకిట్లో వేసిన ముగ్గులు వేయడం సహజం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంటి ముందు ముగ్గులు వేస్తే.. శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. అయితే ఇప్పుడు ఈ ముగ్గు వేయడం వలనే ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఓల్డ్‌సిటీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాజీ నగర్ ప్రాంతంలో రెండు కుటుంబాలు ఎదురుగా నివసిస్తున్నాయి. మాణిక్ ప్రభు వారి తల్లి ఇంటి ముందు ముగ్గు వేసి లోపలికి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఇరుగుపొరుగున నివాసముంటున్న దుర్గేష్ కుటుంబ సభ్యులు వాకిలిని కడగడంతో ఆ ముగ్గు కొట్టుకుపోయింది. దీనిపై మాణిక్ ప్రభు తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది. గొడవ జరగడంతో ఇంట్లోనివారు బయటకు వచ్చారు. దీంతో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో మాణిక్ ప్రభుకు మర్మాంగంపై గాయమైంది. దీంతో మాణిక్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మాణిక్ ప్రభు కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే మాణిక్‌ ప్రభు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తమ పొరుగున ఉండే దుర్గేష్‌, ఆంజనేయులు తమ కుమారుడిని కొట్టి చంపారని ప్రభు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తన చెల్లి రాధను కొట్టడంతో వారితో మాణిక్ ప్రభు వాగ్వాదానికి దిగాడని స్థానికులు తెలిపారు. గతంలోనూ ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. ప్లంబర్‌గా పనిచేస్తున్న మాణిక్ ప్రభు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఆతడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
BRO : పవన్ రేంజ్ మాములుగా లేదుగా.. భారీ స్థాయిలో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్..?