Site icon NTV Telugu

Moinabad Episode: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నిందితులకు కోర్టులో చుక్కెదురు

Trs Mlas Bribe Case

Trs Mlas Bribe Case

ACB Court Rejects Bail Petition of MLAs Bribe Accused: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో అరెస్ట్ అయిన నిందితుల(రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్)కు ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయ్యింది. వీరి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదనలతోనే కోర్టు ఏకీభవించింది. దర్యాప్తు సమయంలో బెయిల్ మంజూరు చేస్తే.. కేసును, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వాదోపవాదనలు విన్న తర్వాత.. నిందితుల బెయిల్ పిటిసన్‌ని ధర్మాసనం కొట్టేసింది. మరోవైపు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై పోలీసులు నాంపల్లి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. అతనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేసన్‌లో రెండు కేసులు నమోదు అవ్వగా.. తాజా ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తులో భాగంగా అతని అరెస్ట్‌కు అనుమతించాలని పోలీసులు కోర్టును కోరారు. ప్రస్తుతం నందకుమార్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఎమ్మెల్యేల ఎర కేసులో అతడు ఏ2గా ఉన్నాడు. ఒకవేళ నాంపల్లి కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతి ఇస్తే, నందకుమార్‌ను అరెస్ట్ చేసి, తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు.

ఇదిలావుండగా.. ఈ కేసులో ప్రమేయం ఉండొచ్చని సిట్ విచారణలో గుర్తించిన కేరళకు చెందిన ప్రముఖ వైద్యుడు పరారీలో ఉన్నట్టు తేలింది. రామచంద్రభారతికి అతడు అత్యంత సన్నిహితుడని గుర్తించిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఆ వైద్యుడ్ని అదుపులోకి తీసుకునేందుకు కేరళలోని అతని నివాసానికి వెళ్లారు. అయితే.. అప్పటికే ఆ వైద్యుడు తప్పించుకుని పారిపోయాడు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నారు. కాగా.. హైదరాబాద్‌లోని నందకుమార్ నివాసాల్లో గంటలపాటు సోదాలు నిర్వహించిన అధికారులకు కొన్ని కీలక పత్రాలు లభ్యమయ్యాయి. అటు.. ఫిల్మ్‌నగర్‌లో అక్రమంగా నిర్మించిన నందకుమార్ కట్టడాల్ని సైతం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. తాము చాలాసార్లు నోటీసులు ఇచ్చినా, వాటిని బేఖాతరు చేయడం వల్ల తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.

Exit mobile version