శాంతి భద్రతలు కాపాడే పోలీసులకు రకరకాల ఫిర్యాదులు వస్తుంటాయి. నాని సినిమాలో పెన్సిల్ పోయిందని పిల్లాడు కంప్లైంట్ చేస్తాడు. అలాంటి కంప్లైంటే వస్తే పోలీసుల పరిస్థితి ఎలా వుంటుంది. అచ్చం సినిమా తరహాలోనే ఫిర్యాదు అందింది. పండగ సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి వచ్చాడో కుర్రాడు. ఇంటికి వచ్చేసరికి అతని సైకిల్ పోయింది. దీంతో తన సైకిల్ వెతికి పెట్టమని పోలీసుల్ని ఆశ్రయించాడో ఆరవ తరగతి చదువుతున్న బాలుడు.
సైకిల్ వెతకండి అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన పదకొండేళ్ళ భువనగిరి సాత్విక్ అనే పిల్లాడు. ఇంటి వద్ద పెట్టిన తన సైకిల్ కనిపించడం లేదని నేరుగా బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెప్పాడు. ఎస్.ఐ ఆవుల తిరుపతి బాలుడి తండ్రికి ఫోన్ చేశాడు. తండ్రి చెప్పిన మాటలు విన్న ఎస్‌ఐకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. తన కొడుకు సాత్విక్ బయట తిరగొద్దని తానే ఇంట్లో సైకిల్ దాచిపెట్టినట్లు తండ్రి తెలిపాడు. అయితే ఎలాంటి భయం లేకుండా, ఎవరి సహాయం లేకుండా ఫిర్యాదు చేయడానికి పోలిస్ స్టేషన్ కు వచ్చిన సాత్విక్ ను ఎస్.ఐ అభినందించారు.
