Strict Action will be taken on Organisations working on November 30: నవంబర్ 30వ తేదీన అంటే రేపు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు ఇంకా గంటల వ్యవధిలోకి వచ్చేయడంతో సర్వత్రా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఇక నవంబర్ 30వ తేదీన ఎన్నికల సంధర్భంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా, వ్యాపార సంస్థలను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక రేపు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఎన్నికలు జరిగే రోజున తెలంగాణలోని అన్ని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈవోగా తాను ఆదేశాలు జారీ చేశానని ఆయన వెల్లడించారు. ఉద్యోగులు అందరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ కంపెనీలు హాలిడే ప్రకటించాలని ఆదేశాల్లో పేర్కొన్న ఎన్నికల సంఘం ఆరోజున సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో జోరుగా బెట్టింగులు..!
ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 29, 30 తేదీల్లో పాఠశాలలకు ప్రభుత్వం ముందస్తుగా సెలవు ప్రకటించింది. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 119గా ఉండగా అందులో 106 సమస్యాత్మకమైనవిగా భావిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను వినియోగిస్తోండగా రాష్ట్ర ప్రభుత్వం 50 వేల మంది పోలీసులను కేటాయించింది. ఎన్నికల నిర్వహణకు ఒక్క బందోబస్తు ఖర్చు మాత్రమే ఏకంగా 150 కోట్లు అవుతుందని ఈసీ అంచనా వేస్తోంది. ఇక ఓటు వేయడానికి వెళ్లేవారు ఏదైనా ఒక గుర్తింపు కార్డును పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలని ఈసీ సూచనలు చేస్తూ ఫొటో ఓటరు స్లిప్ ను ఓటింగ్ కోసం అవసరమయ్యే గుర్తింపు డాక్యుమెంట్ గా పరిగణించరని వెల్లడించింది.