What is Deposit in Elections: ఎన్నికల సమయంలో ఎక్కువగా నాయకులు నోట నుంచి వినే పదం ప్రత్యర్థి డిపాజిట్ కూడా గల్లంతు చేస్తా అంటూ. అయితే అసలు ఈ డిపాజిట్ అంటే ఏమిటి ? అనే విషయం చదువుకున్న చాలా మందికి కూడా తెలియదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అసలు ఆ సంగతి ఏంటి అనేది ఈ తెలంగాణ ఎన్నికల ముందు తెలుసుకుందాం పదండి.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక అభ్యర్థి నామినేషన్ వేయాలంటే ఎన్నికల సంఘానికి కొంత మొత్తం చెల్లించాలి. దీన్ని అచ్చ తెలుగు భాషలో ధరావతు అని ఇంగ్లీష్ లో డిపాజిట్ అని అంటారు. అసెంబ్లీకి పోటీ చేసే నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి. అయితే ఎన్నికలు పూర్తి అయ్యాక ఓట్ల లెక్కింపు కూడా జరిగిన తర్వాత పోలైన చెల్లిన ఓట్లలో ఆరోవంతు మించిన ఓట్లు పోటీచేసిన అభ్యర్థులకు వస్తేనే సదరు అభ్యర్థికి చెల్లించిన డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు అలా రాలేదంటే ఆ డిపాజిట్‌ను ప్రభుత్వమే జప్తు చేసుకుంటుందన్న మాట. ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమయ్యాకే అర్హులైన అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి ఇస్తారు అధికారులు. ఇక్కడ డిపాజిట్ తిరిగి రావడం అంటే కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు నియోజకవర్గంలో పోటీ చేసిన వ్యక్తి బలం గురించి కూడా అన్నమాట. అయితే ఈ విధానాన్ని తీసుకరావడానికి ముఖ్య కారణం సరదాగా, ఏమీ ఊసుపోక పోటీ చేసే వారికి అడ్డుకట్ట వేయడం కోసం. 1951 నాటి ప్రజాప్రాతినిథ్య చట్టంలోని 34(1)(ఎ) నిబంధన ప్రకారం ఈ డిపాజిట్ సొమ్ములు చెల్లించాల్సి ఉంటుంది.