Vu Masterpiece AEye TV: Vu కొత్త Smart TVలు లాంచ్.. 115 ఇంచెస్ స్క్రీన్, AI ఫీచర్లు, 360 డిగ్రీ సరౌండ్ సౌండ్!

Vu Masterpiece Aeye Tv

Vu Masterpiece Aeye Tv

Vu Masterpiece AEye TV: పెద్ద స్క్రీన్‌తో ప్రీమియం స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నవారికి Vu Televisions గుడ్ న్యూస్ చెప్పింది. దేశీయ మార్కెట్లో కొత్తగా Vu Masterpiece AEye TV సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో 55 అంగుళాల నుంచి ఏకంగా 115 అంగుళాల వరకు మొత్తం ఆరు స్క్రీన్ సైజుల్లో టీవీలు అందుబాటులోకి వచ్చాయి. RGB MiniLED డిస్‌ప్లే టెక్నాలజీ, AI ఆధారిత పిక్చర్ అడ్జస్ట్‌మెంట్, 360 డిగ్రీ సరౌండ్ సౌండ్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, ఈ టీవీల్లో Google TV, Gemini AI ఫీచర్లకు కూడా సపోర్ట్ అందించారు. ఈ సిరీస్ ప్రారంభ ధర రూ.75,000 కాగా, టాప్ ఎండ్ 115 అంగుళాల మోడల్ ధర ఏకంగా రూ.13 లక్షలుగా ఉంది.

కొత్త Vu Masterpiece AEye TV సిరీస్‌లో RGB MiniLED డిస్‌ప్లేను అందించారు. ఇది 100 శాతం BT.2020 కలర్ కవరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. సాధారణ మోడళ్లలో 2,500 నిట్స్ వరకు XDR బ్రైట్‌నెస్ లభిస్తుండగా, 115 అంగుళాల టాప్ మోడల్‌లో గరిష్ఠంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో AI ఆధారిత Full Array Local Dimming టెక్నాలజీ కూడా ఉంది. చిన్న స్క్రీన్ మోడళ్లలో గరిష్ఠంగా 2,000 డిమ్మింగ్ జోన్లు ఉండగా, 115 అంగుళాల మోడల్‌లో 2,696 డిమ్మింగ్ జోన్లను అందించారు. దీనివల్ల చిత్రాల్లో కాంట్రాస్ట్, బ్లాక్ లెవల్స్ మరింత మెరుగ్గా కనిపించే అవకాశం ఉంటుంది.

ఫాస్ట్ మూవింగ్ సీన్లు, గేమింగ్ సమయంలో మోషన్ బ్లర్‌ను తగ్గించేందుకు Hyper-Motion AI Engine, 288Hz Fluid Motion సపోర్ట్‌ను అందించారు. అలాగే Intelligent Brightness Control ఫీచర్ ద్వారా టీవీలోని యాంబియంట్ లైట్ సెన్సర్, AI ఇంజిన్ గది వెలుతురు, స్క్రీన్‌పై నడుస్తున్న కంటెంట్‌ను బట్టి బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, కలర్ టెంపరేచర్, HDR సెట్టింగ్స్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తాయి. దీంతో ఎక్కువసేపు టీవీ చూసేటప్పుడు కళ్లపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని కంపెనీ చెబుతోంది.

ఆడియో విషయానికి వస్తే, 55 నుంచి 98 అంగుళాల మోడళ్లలో 110W అవుట్‌పుట్‌తో కూడిన VuFx సిక్స్-డ్రైవర్ ఆడియో సిస్టమ్‌ను అందించారు. ఇక 115 అంగుళాల భారీ మోడల్‌లో 240W అవుట్‌పుట్ కలిగిన 10-డ్రైవర్ ఆడియో సిస్టమ్ ఉంది. అన్ని మోడళ్లలో Dolby Atmos, AI Crystal-Clear Voice టెక్నాలజీలకు సపోర్ట్ లభిస్తుంది. ఇవి మెరుగైన సౌండ్ అనుభూతిని అందించేందుకు ఉపయోగపడతాయి.

సాఫ్ట్‌వేర్ పరంగా ఈ టీవీ సిరీస్ Google TV ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో Gemini AI ఫీచర్లను కూడా అందించారు. ప్రతి మోడల్‌లో 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే రెండు Bluetooth వాయిస్ రిమోట్‌లను కూడా కంపెనీ అందిస్తోంది.

Vu Masterpiece AEye TV ధరలు, సేల్ వివరాలు

55 అంగుళాలు: రూ.75,000
65 అంగుళాలు: రూ.95,000
75 అంగుళాలు: రూ.1,30,000
85 అంగుళాలు: రూ.1,75,000
98 అంగుళాలు: రూ.2,95,000
115 అంగుళాలు: రూ.13,00,000

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ టీవీ సిరీస్ విక్రయాలు భారత్‌లో నవంబర్ 12 నుంచి ప్రముఖ రిటైల్ స్టోర్లలో ప్రారంభమయ్యాయి.