Specialized Levo 4X: 840Wh బ్యాటరీతో స్పెషలైజ్డ్ లెవో 4X ఈ-బైక్ విడుదల.. 4.4 గంటల రైడింగ్, ధర ఎంతంటే?

  • 840Wh బ్యాటరీతో స్పెషలైజ్డ్ లెవో 4X ఈ-బైక్ విడుదల
  • 4.4 గంటల రైడింగ్
  • రూ.11 లక్షలకు పైగా ధర
Specialized Levo 4x

Specialized Levo 4x

ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ స్పెషలైజ్డ్ (Specialized) తన కొత్త హై-పెర్ఫార్మెన్స్ మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్ లెవో 4X (Levo 4X)ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. శక్తివంతమైన మోటార్, భారీ బ్యాటరీ సామర్థ్యం, అధునాతన సస్పెన్షన్ సిస్టమ్‌తో ఈ బైక్‌ను ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ రైడింగ్‌ను ఇష్టపడే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.

స్పెషలైజ్డ్ లెవో 4X ధర

స్పెషలైజ్డ్ లెవో 4X ధర 11,999.99 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 11.41 లక్షలు అవుతుంది. ఈ బైక్ ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీనిని కంపెనీ ‘ఫైరీ రెడ్’ (Fiery Red) అనే ఒకే ఒక్క కరల్ ఆప్షన్ లో విడుదల చేసింది.

×
×
Ad

స్పెషలైజ్డ్ లెవో 4X ఫీచర్లు

ఈ మౌంటెన్ ఈ-బైక్‌లో 840Wh బ్యాటరీ ప్యాక్ అందించారు. అలాగే కంపెనీకి చెందిన అధిక పనితీరు గల S-Works 3.1 మిడ్-డ్రైవ్ మోటార్ ఇందులో అమర్చారు. ఈ మోటార్ గరిష్టంగా 111Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ బైక్ గరిష్టంగా 4.4 గంటల రైడింగ్ సమయాన్ని అందిస్తుంది. అయితే ఈ సమయం రైడింగ్ చేసే భూభాగం, రైడర్ ఎంచుకునే అసిస్టెన్స్ స్థాయిని బట్టి మారవచ్చు.

అడ్వెంచర్ రైడింగ్ కోసం ప్రత్యేక డిజైన్

స్పెషలైజ్డ్ లెవో 4Xను కంపెనీ పూర్తి స్థాయి ఫుల్-సస్పెన్షన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించింది. ఇందులో 11m కార్బన్ ఫ్రేమ్ ఉపయోగించారు. బైక్ మొత్తం బరువు 27.2 కిలోగ్రాములు. అలాగే, ముందు, వెనుక భాగాల్లో 22 కిలోల వరకు అదనపు బరువును మోయగల కార్గో కంపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో అడ్వెంచర్ ట్రిప్స్, లాంగ్ రైడ్స్‌కు అవసరమైన సామగ్రిని సులభంగా తీసుకెళ్లవచ్చు.

సస్పెన్షన్, బ్రేకింగ్ వ్యవస్థ

మెరుగైన రైడింగ్ అనుభవం కోసం బైక్ ముందు భాగంలో 160 మిమీ Fox 38 Factory ఫోర్క్, వెనుక భాగంలో 150 మిమీ Fox Float X Factory రియర్ షాక్ అందించారు. అదనంగా, కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన Genie Shock టెక్నాలజీను కూడా ఇందులో పొందుపరిచింది. భద్రత కోసం ముందు, వెనుక భాగాల్లో 220 మిమీ ఓవర్‌సైజ్డ్ ఫోర్-పిస్టన్ డిస్క్ బ్రేకులు అమర్చారు. ఇవి కఠినమైన భూభాగాల్లో కూడా మెరుగైన నియంత్రణను అందిస్తాయి.

స్మార్ట్ ఫీచర్లు

ఈ బైక్‌లో 2.2 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఇది రైడింగ్ సమాచారం, బ్యాటరీ స్థాయి వంటి వివరాలను చూపిస్తుంది. అలాగే కంపానియన్ మొబైల్ యాప్‌లకు మద్దతు కూడా ఉంది. ఇందులో 12-ఆంప్ స్మార్ట్ ఛార్జర్ను అందించారు. ఇది బహుళ ఛార్జింగ్ మోడ్‌లతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా కలిగి ఉంది. దీంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకునే వీలుంటుంది. శక్తివంతమైన పనితీరు, అధునాతన టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో వచ్చిన స్పెషలైజ్డ్ లెవో 4X మౌంటెన్ ఈ-బైక్, అడ్వెంచర్ రైడింగ్ ప్రియులకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలవనుంది.