Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!

Battery Draining

Battery Draining

Smartphone Battery Draining: మనలో చాలామంది స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడేవాళ్లు ఉంటారు. అయితే స్మార్ట్‌ఫోన్స్ ఎక్కువ వాడడం ద్వారా బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. మరి ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి కొందరు కొత్త ఫోన్ కొంటుంటారు. అయితే ఇలా చేయకుండానే కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా బ్యాటరీ బ్యాకప్‌ను మెరుగుపరచుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ బ్యాక్‌గ్రౌండ్ యాప్స్, డిస్‌ప్లే, కనెక్షన్లు, ఛార్జింగ్ విధానంపై దృష్టి పెడితే బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చు. మరి అవేంటో ఒక్కకితిగా చూసేద్దామా..

బ్యాటరీ ఎలా ఖర్చు అవుతుందో చెక్..

ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో ఏ యాప్స్ ఎక్కువ బ్యాటరీ వినియోగిస్తున్నాయో తెలుసుకోండి. ఆండ్రాయిడ్‌లో Settings > Battery > Battery Usageలో చూడొచ్చు. ఐఫోన్‌లో Settings > Batteryలో యాప్‌ల వారీగా వినియోగాన్ని చెక్ చేయవచ్చు. ఎక్కువ బ్యాటరీ తీసుకుంటున్న అవసరం లేని యాప్స్‌ను అప్డేట్ చేయడం, లేదా పరిమితం చేయడం లేదా తొలగించడం మంచిది.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ నియంత్రణ

మీరు మీ మొబైల్ లో ఉపయోగించకపోయినా కొన్ని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాను సింక్ చేయడం, కంటెంట్ రిఫ్రెష్ చేయడం వంటివి చేస్తుంటాయి. ఆండ్రాయిడ్‌లో Settings > Apps ద్వారా ఆయా యాప్స్ బ్యాక్‌గ్రౌండ్ బ్యాటరీ వినియోగాన్ని పరిమితం చేయవచ్చు. ఐఫోన్‌లో Settings > General > Background App Refresh ద్వారా అవసరం లేని యాప్స్‌కు ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయొచ్చు.

డిస్‌ప్లే సెట్టింగ్స్

స్క్రీన్ కూడా బ్యాటరీని ఎక్కువగా వినియోగిస్తుంది. కాబట్టి బ్రైట్‌నెస్‌ను అవసరమైన స్థాయిలో ఉంచండి. ఆండ్రాయిడ్‌లో Adaptive Brightness, ఐఫోన్‌లో Auto-Brightness ఉపయోగించవచ్చు. OLED, AMOLED స్క్రీన్ ఉన్న ఫోన్లలో Dark Mode ఆన్ చేయడం కూడా కొంత బ్యాటరీని ఆదా చేయడంలో సహాయపడుతుంది.

అవసరం లేని కనెక్షన్లు

మొబైల్ ఉపయోగంలో లేనప్పుడు బ్లూటూత్, లొకేషన్ వంటి ఫీచర్లను ఆఫ్ చేయడం ద్వారా అనవసరమైన బ్యాటరీ వినియోగాన్ని తగ్గించవచ్చు. అవసరం లేని యాప్స్‌కు లొకేషన్ యాక్సెస్‌ను కూడా నిలిపివేయండి. అయితే వై-ఫై, మొబైల్ డేటా లేదా లొకేషన్‌ను అవసరం లేకుండా పూర్తిగా ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు.

ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తలు

బ్యాటరీని ప్రతిసారీ 0 శాతానికి వచ్చే వరకు ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీలైతే సుమారు 20-80 శాతం మధ్య ఛార్జ్ ఉంచడం మంచిది. ఫోన్‌ను ఎక్కువసేపు 100 శాతంపై ఉంచడం, ముఖ్యంగా వేడిగా ఉన్న పరిస్థితుల్లో ఛార్జ్ చేయడం తగ్గించండి. ఫోన్‌లో Adaptive Charging, Charging Limit లేదా Optimised Battery Charging వంటి ఫీచర్లు ఉంటే వాటిని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఫోన్‌ను నేరుగా ఎండలో ఉంచకుండా, ఛార్జింగ్ సమయంలో అధికంగా వేడెక్కకుండా చూసుకోవాలి. ఈ మార్పులన్నింటినీ కలిపి పాటిస్తే బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడటంతో పాటు, దీర్ఘకాలంలో బ్యాటరీ సామర్థ్యం వేగంగా తగ్గకుండా కాపాడుకోవచ్చు.