Primebook 3 Max Laptop Launched at rs35,990: తక్కువ ధరలో కొత్త ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్న వారికి భారతీయ టెక్ కంపెనీ Primebook కొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కంపెనీ Primebook 3 Max పేరుతో తన 3వ తరం సిరీస్‌లో తొలి ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. కొత్త హార్డ్‌వేర్‌తో పాటు అప్‌గ్రేడ్ చేసిన PrimeOS ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందించారు. PrimeOS ద్వారా సాధారణ ప్రొడక్టివిటీ పనులతో పాటు Linux యాప్స్, Linux Terminal, AI ఫీచర్లకు కూడా సపోర్ట్ లభిస్తుంది. విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారు, బేసిక్ ప్రొడక్టివిటీ పనులు చేసుకునే వారికి ఈ ల్యాప్‌టాప్ ఉపయోగకరంగా ఉండేలా రూపొందించారు.
Primebook 3 Max ధర, ఆఫర్లు
Primebook 3 Max ప్రారంభ ధర రూ.35,990గా నిర్ణయించారు. ఈ ల్యాప్‌టాప్‌ను Amazon, Flipkartతో పాటు Primebook అధికారిక D2C స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సేల్ సమయంలో సుమారు రూ.2,000-రూ.2,500 వరకు అదనపు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. దీంతో ప్రభావవంతమైన ధర సుమారు రూ.33,490 నుంచి రూ.33,990 వరకు ఉండవచ్చు. ల్యాప్‌టాప్‌తో పాటు ఒక సంవత్సరం వారంటీ కూడా అందిస్తున్నారు.
Primebook 3 Maxలో 15.6 అంగుళాల Full HD IPS యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే అందించారు. ఇది 1920×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్‌ప్లే గరిష్టంగా 250 నిట్స్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. స్క్రీన్‌పై మ్యాట్ ఫినిష్ ఉండటంతో రిఫ్లెక్షన్స్‌ను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది. డిజైన్ విషయానికి వస్తే ల్యాప్‌టాప్‌లో మెటల్ బాడీ, స్లిమ్ ప్రొఫైల్ ఉన్నాయి.
MediaTek ప్రాసెసర్‌తో పనితీరు
Primebook 3 Maxలో MediaTek Genio 720 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. ప్రాసెసర్‌లో 2 Cortex-A78 కోర్లు – 2.6GHz వరకు 6 Cortex-A55 కోర్లు – 2.0GHz వరకు స్పీడ్‌ను అందిస్తాయి. గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPU అందించారు. ల్యాప్‌టాప్‌లో 8GB LPDDR5 RAM అందించారు. గత మోడల్‌లో LPDDR4X మెమరీ ఉండగా, కొత్త మోడల్‌లో వేగవంతమైన LPDDR5 మెమరీని తీసుకొచ్చారు. కొత్త కాన్ఫిగరేషన్ గత తరం మోడల్‌తో పోలిస్తే 40 శాతం వరకు మెరుగైన పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. Primebook 3 Maxలో 128GB UFS స్టోరేజ్ అందించారు.
అవసరాన్ని బట్టి స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. స్టూడెంట్స్, డాక్యుమెంట్స్, ఆఫీస్ ఫైల్స్, బ్రౌజింగ్ వంటి సాధారణ అవసరాలకు ఈ స్టోరేజ్ సరిపోతుంది. ఎక్కువ ఫైల్స్ లేదా మీడియా కంటెంట్ స్టోర్ చేసేవారు అదనపు స్టోరేజ్‌ను ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే ల్యాప్‌టాప్‌లో 60.3Wh బ్యాటరీ ఉంది. కంపెనీ ప్రకారం ఇది 12 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించగలదు. చార్జింగ్ కోసం 36W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో ప్రయాణాల్లో లేదా ఎక్కువసేపు ప్లగ్‌కు కనెక్ట్ చేయకుండా ఉపయోగించుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
Linux యాప్స్‌కు సపోర్ట్
Primebook 3 Maxలో కంపెనీ సొంత PrimeOS ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించింది. ఇందులో PrimeOffice అనే ఆఫ్‌లైన్-ఫస్ట్ ఆఫీస్ సూట్ కూడా ఉంది. PrimeOfficeలో PrimeDocs, PrimeSheets, PrimePresent వంటి యాప్స్ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రముఖ Linux అప్లికేషన్లకు కూడా నేటివ్ సపోర్ట్ అందిస్తున్నారు. వాటిలో VS Code, GIMP, LibreOffice, Firefox, Arduino IDE, Postman వంటి యాప్స్ ఉన్నాయి.
AI ఫీచర్లు కూడా
Primebook 3 Maxలో AI ఫీచర్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో PrimeAGNT Operator AI అందుబాటులో ఉంది. అలాగే PrimeX Cloud PC సదుపాయం కూడా లభిస్తుంది. దీంతో సాధారణ కంప్యూటింగ్‌తో పాటు AI ఆధారిత పనులు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఫీచర్లను కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

