Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్‌ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్

  • లెనోవో Legion R9000P
  • IJP OLED డిస్‌ప్లే
  • గేమింగ్‌తో పాటు క్రియేటర్లకు కూడా బెస్ట్
Lenovo Legion R9000p

Lenovo Legion R9000p

ప్రముఖ టెక్ కంపెనీ లెనోవో (Lenovo) గేమింగ్ ల్యాప్‌టాప్ మార్కెట్లో మరో వినూత్న ఆవిష్కరణను తీసుకొచ్చింది. కంపెనీ తన కొత్త Lenovo Legion R9000P గేమింగ్ ల్యాప్‌టాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రపంచంలోనే Inkjet-Printed OLED (IJP OLED) డిస్‌ప్లేతో వచ్చిన తొలి గేమింగ్ ల్యాప్‌టాప్ ఇదేనని లెనోవో ప్రకటించింది. ఈ కొత్త డిస్‌ప్లే టెక్నాలజీ గేమింగ్‌తో పాటు కంటెంట్ క్రియేషన్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి పనుల్లో కూడా అత్యుత్తమ విజువల్ అనుభవాన్ని అందించనుంది.

IJP OLED డిస్‌ప్లే అంటే ఏమిటి?

IJP OLED (Inkjet-Printed OLED) అనేది అత్యాధునిక డిస్‌ప్లే టెక్నాలజీ. ఇందులో కాంతిని విడుదల చేసే ప్రత్యేక ద్రవరూప పదార్థాన్ని సూక్ష్మమైన ఇంక్‌జెట్ నాజిల్‌ల ద్వారా గాజు లేదా ప్లాస్టిక్ ఉపరితలంపై ప్రింట్ చేస్తారు. ఈ విధానం వల్ల.. ఖరీదైన Vacuum Evaporation పరికరాల అవసరం ఉండదు. మెటల్ మాస్క్‌ల వినియోగం తగ్గుతుంది. తయారీ ఖర్చు తగ్గడంతో పాటు ఉత్పత్తి వేగం పెరుగుతుంది. మెరుగైన చిత్ర నాణ్యతను అందిస్తుంది. Lenovo Legion R9000Pలో 16 అంగుళాల OLED డిస్‌ప్లేను అందించారు.

ప్రధాన ఫీచర్లు:

240Hz రిఫ్రెష్ రేట్
99% DCI-P3 కలర్ గామట్
Real RGB Stripe Sub-pixel Layout
అత్యంత స్పష్టమైన టెక్స్ట్, షార్ప్ ఇమేజెస్
కలర్ ఫ్రింజింగ్, టెక్స్ట్ బ్లర్ సమస్యలకు చెక్

సాధారణ OLED ప్యానెల్‌లలో కనిపించే త్రిభుజాకార సబ్‌పిక్సెల్ అమరికకు బదులుగా ఇందులో Real RGB Stripe Layoutను ఉపయోగించడం వల్ల మరింత సహజమైన రంగులు, క్లియర్ టెక్స్ట్ కనిపిస్తాయి.

గేమింగ్‌తో పాటు క్రియేటర్లకు కూడా బెస్ట్

99% DCI-P3 కలర్ గామట్ కవరేజీ కారణంగా ఈ ల్యాప్‌టాప్.. ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, 3D కంటెంట్ క్రియేషన్, హై-ఎండ్ గేమింగ్, వంటి పనులకు కూడా అనువుగా ఉంటుంది.

ధర ఇంకా వెల్లడి కాలేదు

Lenovo Legion R9000P ధరను కంపెనీ ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ధర, పూర్తి స్పెసిఫికేషన్లు వెల్లడించే అవకాశం ఉంది.

గేమింగ్ ల్యాప్‌టాప్‌లకు కొత్త దిశ

IJP OLED డిస్‌ప్లే టెక్నాలజీని గేమింగ్ ల్యాప్‌టాప్‌లో తొలిసారి ప్రవేశపెట్టడం ద్వారా లెనోవో మరోసారి సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మెరుగైన విజువల్స్, అధిక రిఫ్రెష్ రేట్, ఖచ్చితమైన రంగులు, అత్యుత్తమ డిస్‌ప్లే నాణ్యతతో Lenovo Legion R9000P గేమింగ్ ల్యాప్‌టాప్‌ల విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.