Lenovo Lecoo P900A: లెనోవా తన లెకూ (Lecoo) బ్రాండ్ కింద చైనా మార్కెట్లో కొత్త బడ్జెట్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. లెనోవో లెకూ P900A పేరుతో వచ్చిన ఈ టాబ్లెట్ కాంపాక్ట్ డిజైన్‌తో పాటు 8-అంగుళాల IPS డిస్‌ప్లే, 4G LTE కనెక్టివిటీ, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో టాబ్లెట్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలవనుంది. లెకూ P900Aలో 8-అంగుళాల IPS HD డిస్‌ప్లే అందించారు.
అయితే స్క్రీన్‌కు సంబంధించిన పూర్తి రిజల్యూషన్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కాంపాక్ట్ సైజ్ కారణంగా ఈ టాబ్లెట్‌ను చేతిలో సులభంగా పట్టుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ టాబ్లెట్ బరువు కేవలం 324 గ్రాములు. వెనుక భాగంలో టెక్స్‌చర్డ్ ప్యానెల్‌ను అందించడం ద్వారా మంచి గ్రిప్‌ను అందించేలా డిజైన్ చేశారు. ఇది ప్లాటినం గోల్డ్ కలర్‌లో లభిస్తుంది.
ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8GB వరకు RAM
పనితీరు కోసం లెకూ P900Aలో మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. అయితే ఏ చిప్‌సెట్‌ను ఉపయోగించారనే విషయాన్ని లెనోవా స్పష్టంగా వెల్లడించలేదు. ఈ టాబ్లెట్‌లో 8GB వరకు RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. స్టోరేజ్ మరింత అవసరమైతే మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు.
13MP కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా
కెమెరాల విషయానికి వస్తే.. లెనోవో లెకూ P900A వెనుక భాగంలో 13MP కెమెరాను అందించింది. ఫొటోలు తీయడంతో పాటు డాక్యుమెంట్లను స్కాన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ముందు భాగంలో వీడియో కాల్స్, ఆన్‌లైన్ క్లాసులు, సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది.
5000mAh బ్యాటరీ, 4G LTE
టాబ్లెట్‌లో 5000mAh బ్యాటరీ అందించారు. రోజువారీ బ్రౌజింగ్, వీడియోలు చూడటం, ఆన్‌లైన్ క్లాసులు వంటి సాధారణ పనులకు ఇది ఉపయోగపడుతుంది. కనెక్టివిటీ పరంగా ఈ టాబ్లెట్ 4G LTEకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో SIM కార్డ్ స్లాట్ ఉండటంతో మొబైల్ డేటాను నేరుగా ఉపయోగించుకోవచ్చు. అలాగే VoLTE ద్వారా వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా ఉంది. 5G SIM కార్డ్‌ను ఉపయోగించినప్పటికీ, ఈ టాబ్లెట్‌లో నెట్‌వర్క్ స్పీడ్ 4Gకే పరిమితం అవుతుంది.
ZUXOS ఆపరేటింగ్ సిస్టమ్
సాఫ్ట్‌వేర్ పరంగా లెకూ P900Aలో లెనోవా ZUXOSను అందించింది. ఇది తేలికైన, సింపుల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేలా రూపొందించిన ఆపరేటింగ్ సిస్టమ్‌గా కంపెనీ పేర్కొంది. ఇందులో Lenovo Super Interconnect 3.0 ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా లెనోవో PCలు, Motorola స్మార్ట్‌ఫోన్‌ల మధ్య ఫైల్ షేరింగ్, నోటిఫికేషన్ సింక్రనైజేషన్, యాప్ కాస్టింగ్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. అదనంగా iOS డివైజ్‌లతో బేసిక్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ సపోర్ట్ కూడా ఉంది.
లెనోవో లెకూ P900A ధర
ధర విషయానికి వస్తే.. లెనోవో లెకూ P900Aను చైనాలో 899 యువాన్ల ప్రారంభ ధరతో విడుదల చేసింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.13,000గా ఉంటుంది. ప్రస్తుతం ఈ టాబ్లెట్ చైనాలో JD.com ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది. ప్లాటినం గోల్డ్ కలర్‌లో మాత్రమే లభిస్తోంది.
భారత్‌లో ఎప్పుడు?
ప్రస్తుతం లెనోవో లెకూ P900Aను చైనా మార్కెట్‌లో మాత్రమే విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ టాబ్లెట్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై కంపెనీ నుంచి అధికారిక సమాచారం లేదు.

