Site icon NTV Telugu

Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!

Google Internship 2026

Google Internship 2026

Google: ఈరోజు మనం ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ముందుగా చేసే పని ‘గూగుల్’ చేయడం. అరచేతిలో ప్రపంచాన్ని ఉంచిన గూగుల్, తన ప్రయాణంలో ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్యకరమైన మలుపులను చూసింది. అలాంటి ఈ టెక్ జెయింట్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి తెలుసా. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్ 1999లో ఈ సంస్థను ‘ఎక్సైట్’ (Excite) అనే కంపెనీకి కేవలం 1 మిలియన్ డాలర్లకు విక్రయించాలని భావించారు. కానీ ఆ డీల్ కుదరలేదు. నేడు గూగుల్ విలువ లక్షల కోట్ల డాలర్లు అంటే, ఆనాడు ఆ డీల్ కుదరకపోవడమే గూగుల్ పాలిట వరమైంది. గూగుల్ తన ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఒకవేళ గూగుల్ ఉద్యోగి మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి పదేళ్ల పాటు సగం జీతాన్ని సంస్థ చెల్లిస్తుంది. అంతేకాదు వారి పిల్లలకు 19 ఏళ్లు వచ్చే వరకు నెలకు 1,000 డాలర్ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. గూగుల్ స్థాపించిన తేదీపై దాని వ్యవస్థాపకులకే స్పష్టత లేదు. మొదట్లో సెప్టెంబర్ 7, 8, 26 తేదీల్లో వేడుకలు జరిపేవారు. వికీపీడియా ప్రకారం సెప్టెంబర్ 4న స్థాపించినట్లు ఉన్నా, 2006 నుంచి అధికారికంగా సెప్టెంబర్ 27వ తేదీన గూగుల్ తన బర్త్‌డేను జరుపుకుంటోంది.

‘గూగోల్’ (Googol) అనే పదం నుంచి గూగుల్ పుట్టింది. గణిత శాస్త్రంలో ‘1’ పక్కన ‘100’ సున్నాలు పెడితే వచ్చే సంఖ్యను గూగోల్ అంటారు. అలాగే కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని ‘గూగుల్‌ప్లెక్స్’ (1 తర్వాత 10 వేల సున్నాలు) అని పిలుస్తారు. 2004 ఏప్రిల్ 1న గూగుల్ ‘జీమెయిల్’ను ప్రారంభించింది. ఆ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే కావడంతో ప్రపంచం అంతా ఇది ఏదో జోక్ అని భావించింది. కానీ నేడు అది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెయిల్ సర్వీస్‌గా నిలిచింది. ఎడారి ప్రాంతాలను స్ట్రీట్ వ్యూలో చూపించేందుకు గూగుల్ ఒక ఒంటెను అద్దెకు తీసుకుని, దానిపై కెమెరాలను అమర్చి ఫోటోలు తీయించింది తెలుసా. 2013, ఆగష్టు 16న గూగుల్ సర్వర్లు కేవలం 5 నిమిషాల పాటు డౌన్ అయ్యాయి. ఆ సమయంలో ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఏకంగా 40 శాతం పడిపోయింది. దీనిని బట్టి గూగుల్ ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు.

ఒకప్పుడు యాహూ సంస్థ గూగుల్‌ను 3 బిలియన్ డాలర్లకు కొనాలని ఆఫర్ ఇచ్చింది. కానీ గూగుల్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. ప్రపంచంలోని దాదాపు 120 మిలియన్ల ప్రత్యేక పుస్తకాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నిమిషానికి 20 లక్షలకు పైగా సెర్చ్‌లు, 150కి పైగా భాషల్లో సేవలు అందిస్తూ, ఒక స్మార్ట్ కంప్యూటర్ తనను తానే ప్రోగ్రామ్ చేసుకునే స్థాయికి గూగుల్ ఎదిగింది. ఈ రోజు ఒక సామాన్యుడి నుంచి మేధావుల వరకు అందరి జీవితాల్లో గూగుల్ అంతర్భాగమైందంటే అతిశయోక్తి కాదు.

Exit mobile version